– బాలింత మృతి
– నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం
ఇదేనిజం, నాగర్ కర్నూల్ : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూది వదిలేయడంతో పరిస్థితి విషమించి బాలింత కన్నుమూసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దర్శన్‌గడ్డ తండాకు చెందిన గిరిజన మహిళ రోజా నిండు గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 15న అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించారు. ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజున కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వైద్యులు.. పొరపాటున కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. వారం రోజుల తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను మంగళవారం మరోసారి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి రోజా మృతి చెందింది.