2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్‌పై దృష్టి కేంద్రీకరించాయి.
టెలికం రంగంలో పోటీని తట్టుకొని నిలిచేందుకు వినియోగదారులకు సౌకర్యవంతమైన టెక్ సదుపాయాలను కల్పించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి.
అందులోభాగంగానే 6జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
6G .. వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో ఆరో జనరేషన్ ఇది. ఇది అత్యంత, భారీ పౌనఃపున్యం ఉన్న తరంగాలను( THF ) ( Submillimeter Waves ) ఉపయోగించుకోనున్నది.
దీని వేగం 5జీ కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
6జీతో ఒక సెకనుకు 1 టెరాబైట్ డేటా రేట్ ఉంటుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ రంగాలకు తగ్గ సామర్థ్యాన్ని 6జీ కలిగి ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
రియల్ టైం డేటా, బిగ్ డేటా పనితీరును అమాంతం పెంచేస్తుందని వివరించారు.
సెన్సింగ్, ఇమేజింగ్, డిప్లేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు అత్యాధునికతను సంతరించుకొంటాయని తెలిపారు.
ఎక్స్ టెండెడ్ రియాలిటీ, మొబైల్ హోలోగ్రామ్ చూసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
మొబైల్‌లో హోలోగ్రామ్ చూడొచ్చు
6జీతో మొబైల్‌లోనే హోలోగ్రామ్ చూసే వీలు కలుగనున్నది. వాస్తవానికి హోలోగ్రామ్‌ను మొబైల్‌లో చూడాలంటే 580 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ అవసరం.
6జీతో అది సాధ్యం కానున్నది. సైన్స్ ఫిక్షన్ అనుకొనే ఎన్నో అంశాలను 6జీ ద్వారా నిజం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
6జీ ఎప్పుడొస్తుంది?
వాణిజ్యపరంగా 2030 నాటికి 6జీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నా, టెక్నాలజీని కరోనా ఇంకాస్త ముందుకు తోసింది.
ఈ పర్యవసానంతో మరో మూడేండ్లలో మనం 6జీ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
6జీ ఉపయోగాలివీ..
- ఆరోగ్య పర్యవేక్షణ
- వేగవంతమైన ఫేషియల్ రికగ్నిషన్
- గాలి నాణ్యత కొలతలో కచ్చితత్వం
- గ్యాస్, టాక్సిసిటీ సెన్సింగ్
- మొబైల్ టెక్నాలజీ… తదితరాలు
6జీ – ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సరికొత్త రికార్డు
6జీ సిగ్నల్ ద్వారా 100 మీటర్ల వరకు డేటాను పంపించి ప్రముఖ దక్షిణ కొరియా సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రికార్డు సృష్టించింది.
కొన్ని నెలల క్రితం 15 మీటర్ల వరకు డేటాను పంపించగా, ఆ రికార్డును తాజాగా బద్దలు కొట్టింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
7G వైపు కూడా అడుగులు పడుతున్నయా?
ప్రపంచవ్యాప్తంగా 5జీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అప్పుడే 6జీ గురించి చర్చ జరుగుతున్నది.
అయితే.. 7జీ వైపు పరిశోధకులు అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
జీరో జనరేషన్ నుంచి 5జీ వరకు ప్రస్థానం ఇలా.. (Zero Generation to 5th Generation)
0జీ (0 Generation)
ఇటలీకి చెందిన గగ్లీయెల్మో మార్కోనీ మోర్స్ కోడ్‌ను రేడియో తరంగాలను ఉపయోగించి వైర్‌లెస్‌గా 3.4 కిలోమీటర్ల దూరానికి పంపించాడు.
ఇది జరిగిన శతాబ్దానికి అంటే.. 1973లో తొలి వైర్‌లెస్ మొబైల్ ఫోన్ (జీరో జనరేషన్) వచ్చింది. ఇదే వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో కీలక సందర్భం.
1జీ (1st Generation)
మోటరోలా ఇంజినీర్ మార్టిన్ కూపర్ పుణ్యమా అని టెలికమ్యూనికేషన్ కంపెనీలు 1జీని అభివృద్ధి చేశాయి. 1జీ బ్యాండ్‌విడ్త్ 30KHz, స్పీడ్.. 2.4 కేబీపీఎస్‌గా ఉండేది.
దాంతో వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకొనేందుకు వీలుండేది. 1జీ.. తక్కువ నాణ్యత, లిమిటెడ్ కెపాసిటీ కలిగినది. 1991 వరకు దీన్ని వాడారు.
2జీ (2nd Generation)
90ల్లోనే 2జీ కూడా మార్కెట్‌లోకి వచ్చింది. దాంతో మెసేజ్‌లు, ఈమెయిల్, తక్కువ వేగంతో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకొనే వీలుకలిగింది. బ్యాండ్‌విడ్త్ 30 KHz నుంచి 200 KHzకు పెరిగింది. ఇంటర్నెట్ వేగం కూడా 384 కేబీపీఎస్‌కు చేరింది.
3జీ (3rd Generation)
3జీ రంగ ప్రవేశంతో వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం కలిగింది. ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్లు 50 రెట్లు పుంజుకున్నాయి.
3జీ నుంచి 4జీకి మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.
4జీ (4th Generation)
4జీ వల్ల కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్‌లో అత్యంత వేగంగా విస్తరించిన జనరేషన్ ఏదన్నా ఉందంటే అది 4జీ మాత్రమే.
5జీ (5th Generation)
5జీ స్పీడ్ 20 జీబీపీఎస్. ఆటోమేషన్, Xtreme Reality (XR) రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని ప్రముఖ సంస్థ క్వాల్‌కామ్ వెల్లడించింది. ఇది హైస్పీడ్ ఇంటర్నెట్, అల్ట్రా లో లాటెన్సీ, భారీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది.