Homeలైఫ్‌స్టైల్‌#Diabetes #Sugar : షుగ‌ర్ వ్యాధి రకాలు, రాకుండా జాగ్రత్తలు, పూర్తి సందేహాలు..

#Diabetes #Sugar : షుగ‌ర్ వ్యాధి రకాలు, రాకుండా జాగ్రత్తలు, పూర్తి సందేహాలు..

మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది.

రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర (గ్లూకోజ్) మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ రుగ్మత తలెత్తుతుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీయగలదు.

ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని.. నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా.

దీనివల్ల ప్రమాదాలు ఉన్నా కూడా మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు.

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకూ ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు.

మధుమేహానికి కారణాలేమిటి?

మనం ఆహారం తిన్నప్పుడు.. పిండిపదార్థాలను మన శరీరం ముక్కలుగా చేసి చక్కెరగా మారుస్తుంది. దానిని గ్లూకోజ్‌గా వ్యవహరిస్తారు. క్లోమం(పాంక్రియాస్)లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్.. ఆ చక్కెరను శక్తి కోసం లీనం చేసుకోవాలని మన శరీర కణాలకు నిర్దేశిస్తుంది.

ఈ ఇన్సులిన్ ఉత్పత్తి కానపుడు.. లేదంటే అది సరిగా పనిచేయనపుడు రక్తంలో చక్కెర పోగుపడుతుంది. అలా మధుమేహం వస్తుంది.

మధుమేహం ఎన్ని రకాలు?

మధుమేహంలో పలు రకాలు ఉన్నాయి.

టైప్ 1 డయాబెటిస్‌లో పాంక్రియాస్ (క్లోమగ్రంధి) నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి.

ఎందుకిలా జరుగుతుందనేది శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కచ్చితంగా గుర్తించలేదు. అయితే.. జన్యువుల ప్రభావం వల్ల లేదా క్లోమగ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను వైరల్ ఇన్‌ఫెక్షన్ దెబ్బతీయటం వల్ల గానీ ఇలా జరుగుతుండవచ్చునని వారు భావిస్తున్నారు.

మధుమేహం ఉన్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఈ టైప్-1 ఉంది.

టైప్-2 డయాబెటిస్‌లో క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థంగా పనిచేయదు.

ఇది సాధారణంగా మధ్య వయస్కులు, వయోవృద్ధుల్లో జరుగుతుంది. అయితే.. అధిక బరువున్న, శరీరానికి పని చెప్పని యువతలోను.. కొన్ని జాతులకు చెందిన.. ప్రత్యేకించి దక్షిణాసియా వాసుల్లో యువతలో కూడా ఈ టైప్-2 మధుమేహం అధికంగా కనిపిస్తోంది.

కొందరు మహిళలు గర్భంతో ఉన్నపుడు.. గర్బిణి మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) వస్తుంది. ఆ మహిళకు, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను వారి శరీరాలు ఉత్పత్తి చేయలేకపోవటం దీనికి కారణం.

విభిన్న ప్రాతిపదికలను ఉపయోగించి నిర్వహించిన వేర్వేరు అధ్యయనాలు.. గర్భిణుల్లో 6 నుంచి 16 శాతం మంది వరకూ ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వస్తుందని అంచనా వేశాయి.

ఇది టైప్-2 డయాబెటిస్‌గా మారకుండా నిరోధించటానికి.. అటువంటి గర్భిణులు ఆహార నియమాలు, శారీరక వ్యాయామం.. అవసరమైతే ఇన్సులిన్ వాడటం ద్వారా తమ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవలసి ఉంటుంది.

కొందరిలో మధుమేహానికి ముందు దశ కూడా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండే ఈ స్థితి.. మధుమేహానికి దారితీయవచ్చు.

డయాబెటిస్ లక్షణాలు ఏమిటి?

చాలా సాధారణ లక్షణాలు:

  • అధికంగా దాహంగా అనిపిస్తూ ఉండటం
  • మామూలు కన్నా ఎక్కువగా.. ప్రత్యేకించి రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయటం
  • చాలా అలసిపోయినట్లు అనిపించటం
  • ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోవటం
  • నోట్లో తరచుగా పుండ్లు అవుతుండటం
  • చూపు అస్పష్టంగా మారటం
  • శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవటం

టైప్-1 డయాబెటిస్ లక్షణాలు.. చిన్నప్పుడు లేదా యుక్త వయసులో త్వరగా కనిపిస్తాయని.. ఇంకా తీవ్రంగా ఉంటాయని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్తోంది.

సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారికి (దక్షిణాసియా వాసులకైతే 25 ఏళ్లకే) టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

తల్లిదండ్రుల్లో లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా ఈ రుగ్మత ఉన్నా, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి, దక్షిణాసియా, చైనా, ఆఫ్రో-కరీబియన్, బ్లాక్ ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది.

మధుమేహాన్ని నివారించగలమా?

మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.

ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే.

రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం.. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.

ఆరోగ్యవంతమైన బరువు కూడా.. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే.. నెమ్మదిగా తగ్గటానికి.. వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి.

హృద్రోగాల ముప్పును తగ్గించుకోవటానికి కొవ్వు (కొలెస్టరాల్) స్థాయి కూడా పరిమితుల్లో ఉండేలా చూసుకోవటం, ధూమపానానానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే.

మధుమేహం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?

రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటే.. అది రక్త నాళాలాను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించలేకపోతే.. రక్తం అవసరమైన శరీర భాగాలకు అది చేరదు. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినటం, చూపు కోల్పోవటం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలు పెరుగుతాయి.

అంధత్వం, మూత్రపిండాలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి వాటికి మధుమేహం ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది.

2016లో 16 లక్షల మంది.. నేరుగా మధుమేహం వల్లే చనిపోయారు.

ఎంత మందికి మధుమేహం ఉంది?

డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం ప్రకారం.. 1980లో 10.8 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటే.. 2014లో ఆ సంఖ్య 42.2 కోట్లకు పెరిగింది.

1980లో వయోజనుల్లో (18 ఏళ్లు వయసు దాటిన వారు) 5 శాతం కన్నా తక్కువ మందికి మధుమేహం ఉంటే.. 2014లో ఆ రేటు 8.5 శాతానికి చేరింది.

మధుమేహంతో జీవిస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది.. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్న మధ్య, అల్పాదాయ దేశాల్లో ఉన్నారని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా.

అభివృద్ధి చెందిన దేశాల్లో.. పేదరికానికి, నాసిరకం, శుద్ధి చేసిన ఆహారానికి – మధుమేహానికి సంబంధం ఉందని చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img