Homeఅంతర్జాతీయం#Afghanistan #Taliban : ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల పాలన

#Afghanistan #Taliban : ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల పాలన

ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా? శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లగానే తాలిబన్లు ఆఫ్ఘన్‌ మీద తిరిగి పట్టు సాధిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో 85 శాతం భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. వారి ధాటికి తట్టుకోలేక ప్రభుత్వ బలగాలు పారిపోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.

మధ్య కొన్ని నెలల పాటు ఆఫ్ఘన్‌ను తాలిబన్లు పాలించారు. ఈ కాలంలో మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. తప్పు చేసిన వారికి క్రూరమైన శిక్షలను అమలు చేశారు.

ఇన్నేళ్లలో తాలిబన్ల దాడుల వల్ల ఆఫ్ఘన్‌లోని దాదాపు సగం జనాభా (1.84 కోట్లు) కనీస వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఆఫ్ఘన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి తాలిబన్లు భిన్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇరాన్‌, తజకిస్థాన్‌, టుర్క్‌మెనిస్థాన్‌, చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని ప్రాంతాలపై తాలిబన్లు ఇప్పటికే పైచేయి సాధించినట్టు తెలుస్తున్నది. తాలిబన్ల పాలనను వ్యతిరేకించే వారి నుంచి ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి సహకారం అందకుండా నిరోధించడమే దీని లక్ష్యం. దీంతోపాటు దేశంలోని కీలక పట్టణాలను కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాందహార్‌లో పరిస్థితులు క్షీణించడంతో భారత్‌ తన దౌత్యవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చింది.

ఎందుకు ఆక్రమిస్తున్నారు?

దేశంలో ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది తాలిబన్ల లక్ష్యం. మహిళలకు ఓటు హక్కు, ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆఫ్ఘన్‌ ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ యావత్‌ దేశాన్ని తమ గుప్పిట్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమం లో గత కొన్నేండ్లుగా ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి ఖతార్‌లోని దోహాలో గత సెప్టెంబర్‌లో చర్చలు జరిగినప్పటికీ ఫలప్రదంకాలేదు.

అమెరికా బలగాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గతేడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అగ్రరాజ్యం బలగాలను ఉపసంహరిస్తున్నది. అమెరికా, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్‌ భూభాగాన్ని ఎవరినీ వాడుకోనివ్వబోమని తాలిబన్‌తో అమెరికా ఈ ఒప్పందం
కదుర్చుకుంది.

పాక్‌కు దడ

దశాబ్దాలుగా తాలిబన్లను పెంచి పోషించిన పాకిస్తాన్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తాలిబన్లను పెంచుతూ ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పిన పాక్‌ తాను తీసిన గోతిలో తనే పడే పడుతున్నది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు తిరిగి ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకొంటున్నారు. ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నది. పాకిస్తాన్‌ దీన్ని ఊహించలేదు. చర్చల ద్వారా అధికార మార్పిడి జరుగుతుందని, తాలిబన్లు ఆఫ్ఘన్‌ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారని భావించింది. కానీ వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్యుద్ధం మొదలైతే పాక్‌లోకి ఆఫ్ఘన్‌ నుంచి వలసలు తప్పవని భావిస్తున్నారు. వలసలు గనుక మొదలైతే ఆపడం తమ తరం కాదని ఇటీవలే పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ అన్నారు.

ఎవరీ తాలిబన్లు?

1990 తొలినాళ్లలో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సోవియెట్‌ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్థాన్‌ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్లు పాటుపడ్డారు. అవినీతి నిర్మూలన, అభివృద్ధి నినాదాలతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది. క్రమంగా వీళ్లు ఆఫ్ఘన్‌పై పట్టు బిగించి నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అదే సమయంలో కఠినమైన శిక్షల అమలు, మహిళలపై ఆంక్షలు విధించడంతో వారిపై వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడానికి సాయపడుతున్న సోవియెట్‌ యూనియన్‌ను బలహీనపరచడానికి తాలిబన్లకు అమెరికా సాయం చేసినట్టు చెబుతారు. అయితే, తాలిబన్లకు అప్పటివరకూ పరోక్ష మిత్రుడిగా ఉన్న అమెరికాపై సెప్టెంబర్‌ 11, 2001న (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి) అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ దాడులకు పాల్పడ్డాడు. అతను అఫ్ఘాన్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం లాడెన్‌ను అప్పగించాల్సిందిగా తాలిబన్లను కోరింది. దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరుతో అమెరికా ఆఫ్ఘన్‌లో 20 ఏండ్లపాటు బలగాలను మోహరించింది.

Recent

- Advertisment -spot_img