HomeజాతీయంPetrol and Diesel under GST : జీఎస్టీలోకి పెట్రోల్‌, డీజిల్‌.. కొవిడ్‌ అత్యవసరాలపై..?

Petrol and Diesel under GST : జీఎస్టీలోకి పెట్రోల్‌, డీజిల్‌.. కొవిడ్‌ అత్యవసరాలపై..?

పెట్రోల్‌, డీజిల్‌పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ రెండు ప్రధాన ఇంధనాలతో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుచేసే ప్రతిపాదనను సెప్టెంబర్‌ 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి.

ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుపై పన్ను వేసే విధానానికి ముగింపుపలకాలంటే ఈ ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చడమే పరిష్కారమని ఉన్నతస్థాయి అధికార వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఇంధనాల ఉత్పత్తి వ్యయంపైనే కాకుండా, కేంద్రం విధించే ఎక్సయిజు సుంకంపై కూడా రాష్ర్టాలు వ్యాట్‌ను వసూలుచేస్తున్న సంగతి తెలిసిందే.

పెట్రోల్‌, డీజిల్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే నిర్ణయాన్ని తీసుకోవాలంటూ జూన్‌ నెలలో కేరళ హై కోర్టు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కొవిడ్‌ అత్యవసరాలపై పన్నుండదు..

కొవిడ్‌-19 అత్యవసరాలపై పన్ను తగ్గింపు గడువును వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పొడిగిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఈ నెల 17న జరిగే సమావేశం వర్చువల్‌గా కాకుండా, భౌతికంగా జరుగుతుంది.

ఈ 45వ జీఎస్టీ సమావేశం భౌతికంగా జరగడం 20 నెలల తర్వాత ఇదే ప్రథమం. రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు.

జూన్‌ 12న గత కౌన్సిల్‌ సమావేశం వీడియో కాన్ఫెరెన్సింగ్‌ ద్వారా జరిగింది.

రెమిడిసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఆక్సిజెన్‌, ఆక్సిజెన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర కొవిడ్‌ అత్యవసరాలపై సెప్టెంబర్‌ 30 వరకూ జీఎస్టీని తగ్గిస్తూ ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ తగ్గింపు డిసెంబర్‌ 31వరకూ పొడిగించవచ్చని భావిస్తున్నారు.

కొన్ని లోహాలపై జీఎస్టీని 18 శాతానికి, పునరుత్పాదక విద్యుత్‌ పరికరాలపై 12 శాతానికి పెంచే అంశాన్ని కౌన్సిల్‌ చర్చిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే పొగాకు, పాన్‌మసాలా తదితర హానికారక ఉత్పత్తులపై సెస్‌ వసూలును కొనసాగించేందుకు నియమనిబంధనల్ని కూడా కౌన్సిల్‌ ఆ సమావేశంలో చర్చిస్తుంది.

జీఎస్టీ+ సర్‌చార్జీ

జీఎస్టీ విధానంలో ప్రస్తుతం ఏ ఉత్పత్తికైనా 28 శాతం గరిష్ఠ పన్ను రేటు ఉన్నది. ఇంతకంటే ఎక్కువ రేటులో పన్ను వేయాలంటే జీఎస్టీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.

వీటిపై ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రం విధిస్తున్న మొత్తం పన్నులకు సమానంగా (50 శాతం) జీఎస్టీగా వసూలు చేసే మార్గంగా 28 శాతం గరిష్ఠరేటుతో కలిపి ఒక నిర్ణీతరేటులో సర్‌చార్జ్‌ను వసూలు చేయాలన్న ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

జీఎస్టీ అనేది వినియోగంపై విధించే పన్ను అయినందున, ఆ ఇంధనాల్ని ఉత్పత్తి, దిగుమతి చేస్తున్న గుజరాత్‌ నష్టపోతుందని, ఉత్తరప్రదేశ్‌ వంటి అధిక వినియోగం కలిగిన రాష్ట్రం లబ్దిపొందుతుందని పన్ను నిపుణులు వివరిస్తున్నారు.

వీటిని జీఎస్టీలోకి తీసుకురావడం కేంద్రం, రాష్ర్టాలు… రెండింటికీ భారమైన వ్యవహారమేనని ఆ నిపుణులు వ్యాఖ్యానించారు.

కేంద్రం, రాష్ర్టాలు.. రెండింటికీ భారమే..

ఇంధనోత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే&వీటిపై అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ఆదాయంలో భారీగా గండి పడుతుంది.

ఈ కారణంగా కేంద్రం, రాష్ర్టాలు ఆదాయంపై రాజీపడాల్సి ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజవాయువు, ముడి చమురు-ఈ ఐదు పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం వంటి కేంద్ర పన్నులు, వ్యాట్‌ తదితర రాష్ర్టాల పన్నుల్ని 2017లో జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు.

ఈ ఉత్పత్తులపై వచ్చే భారీ పన్ను ఆదాయంపైనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు ఆధారపడిఉన్నందున, అప్పట్లో జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకం ధరలో కేంద్ర ఎక్సయిజు, రాష్ర్టాల వ్యాట్‌లు (వాల్యూ యాడెడ్‌ టాక్స్‌) సగం వరకూ ఉన్నాయి.

ప్రస్తుతం జీఎస్టీ మొత్తం ఆదాయాన్ని కేంద్రం, రాష్ర్టాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటున్నాయి.

పెట్రోల్‌పై లీటరుకు రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 కేంద్రం ఎక్సయిజు సుంకాన్ని, సెస్సులను విధిస్తున్నది.

సెస్సులను రాష్ర్టాలతో కేంద్రం పంచుకోనందున, ఈ ఇంధనాల్ని జీఎస్టీలో చేరిస్తే సెస్సుల ఆదాయాన్ని కేంద్రం కోల్పోతుంది.

Recent

- Advertisment -spot_img