Taliban planning for own air force : సొంత వైమానిక దళం దిశగా తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్‌ను చేజిక్కించుకుని పాలన సాగిస్తున్న తాలిబన్లు ఇప్పుడు దేశ రక్షణపై దృష్టిపెట్టారు.
సొంత వాయుసేన ఏర్పాటు దిశగా సన్నాహాలు ప్రారంభించారు.
మంగళవారం కాబూల్‌లోని ప్రధాన మిలిటరీ ఆసుపత్రి అయిన సర్దార్ దావూద్ ఖాన్ హాస్పిటల్‌పై ఐసిస్-కె ఉగ్రవాదులు జరిపినట్టుగా చెబుతున్న దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఘటన జరిగిన వెంటనే తాలిబన్ పైలట్లతో కూడిన అమెరికా బ్లాక్ హాక్ సహా మూడు హెలికాప్టర్లు ఆసుపత్రి పైకప్పుపై మోహరించాయి.
అందులోని క్విక్ రియాక్షన్ బృందం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపింది.
ఈ ఘటన తర్వాత ఉగ్రదాడులను ఎదురొడ్డేందుకు సొంత వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తాలిబన్ అంతర్గత శాఖ మంత్రి ఖరీ సయీద్ ఖోస్తీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఎయిర్‌ఫోర్స్ నిపుణులను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని, వారు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ వద్ద మంచి ప్రణాళిక ఉందన్నారు. అందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చుకుంటామన్నారు.
కాబూల్‌లోని తాలిబన్ నిఘా విభాగంలోని అత్యున్నత అధికారి కూడా సొంత వాయుసేన కలిగి ఉండడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
త్వరలోనే పూర్తిస్థాయి ఎయిర్‌ఫోర్స్‌ను పునర్నిర్మించుకుంటామని తాలిబన్ వర్గాలను ఉటంకిస్తూ ‘కెన్యూజ్’ అనే మీడియా సంస్థ పేర్కొంది.