HomeతెలంగాణBIG BOSS contention: బిగ్ బాస్ వివాదాలు

BIG BOSS contention: బిగ్ బాస్ వివాదాలు

BIG BOSS contention:

బిగ్ బాస్ ఆరో సీజన్ మొదలైంది. అది బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణగారు మళ్ళీ ఘాటు విమర్శలు మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడొకసారి బిగ్ బాస్ చరిత్రనూ, వివాదాలనూ గుర్తు చేసే ప్రయత్నమే ఈ వ్యాసం:

బిగ్ బాస్: వివాదాలే ఊపిరి

బాహ్యప్రపంచానికి దూరంగా కొద్దిమందిని ఒకచోట ఉంచితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకరిపట్ల ఇంకొకరు ఎలా వ్యవహరిస్తారు? సమాజంలో పేరున్న వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రత్యక్షంగా చూపించటానికి దాదాపు పాతికేళ్ళ కిందట చేసిన ఆలోచన ఫలితం మన బిగ్ బాస్. భారత్ లో బిగ్ బాస్ అని పేరు పెట్టుకున్న ఈ కార్యక్రమం అసలు పేరు బిగ్ బ్రదర్. ప్రపంచవ్యాప్తంగా 68 భాషల్లో 508 సీజన్లు పూర్తిచేసుకున్నా, ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే రియాల్టీ షోస్ కి ఇవేం కొత్త కాదు. బిగ్ బ్రదర్ పుట్టుకతోనే వివాదాలూ, కోర్టు కేసులూ ఎదుర్కుంది.

భారత్ లో బిగ్ బాస్ కూడా గొడవలు, నాటకీయత, వెన్నుపోట్లు, మోసాల మధ్యనే సాగింది. అవి లేకపోతే అది బిగ్ బాస్ కాదు. హౌస్ మేట్స్ హౌస్ లోకి రాకముందు, తరువాత కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చర్చించటం ఈ సోషల్ మీడియా కాలంలో మరీ పెరిగిపోయింది. హిందీలో 15 ఏళ్లలో 15 సీజన్ల దాకా రాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ భాషలలో కూడా బిగ్ బాస్ నడుస్తోంది. బెంగాలీలో ఆగిపోయింది.

ఇలా మొదలైంది

నెదర్లాండ్స్ లో ఒక టీవీ ప్రొడక్షన్ సంస్థ ఎండెమాల్ ఆఫీసులో నలుగురు కూర్చొని చర్చిస్తూ ఉండగా వచ్చిన ఆలోచన ఇది. ఒక విలాసవంతమైన ఇంట్లో ఆరుగురు ఏడాదిపాటు నివసిస్తూ, బహుమతి గెలుచుకోవటానికి చివరిదాకా ఉండగలగటం దీని కాన్సెప్ట్. అయితే, ఈ మేధోమధనం ఆషామాషీగా జరగలేదు. ఈ ఆలోచన అకస్మాత్తుగా పుట్టుకొచ్చిందీ కాదు. అనేక ఘటనలూ, కార్యక్రమాల కలబోతతో దీనికొక స్పష్టమైన రూపం ఇవ్వటానికి ఏడాదిన్నరకు పైగానే పట్టింది.

అప్పటికే బయోస్ఫియర్ -2 ప్రయోగం జరిగింది. ఆరిజోనా ఎడారిలో రెండెకరాల మరోప్రపంచం తయారు చేశారు. భూమ్మీద పరిస్థితులనే కృత్రిమంగా సృష్టించి ఎనిమిది మందిని అందులో ఉంచారు. అయితే, అక్కడి పచ్చదనంతో తగినంత ఆక్సిజెన్ అందకపోవటం లాంటి కారణాలతో రెండేళ్లకు బదులు ఏడాదిలోపే ముగించారు. ఆ తరువాత ఎంటీవీ ‘ది రియల్ వాల్డ్’ పేరుతో ఇంకో కార్యక్రమం ప్రసారం చేసింది. అపరిచితులను ఒకచోట చేర్చి వాళ్ళమధ్య డ్రామాను రికార్డు చేయటం దీని థీమ్. బీచ్ లో నగ్నంగా తిరగటం కూడా రికార్డు చేసి ప్రసారం చేశారు. ఆ తరువాత రకరకాల పోటీలతో వరుసగా ఎలిమినేట్ చేస్తూ విజేతను ప్రకటించేలా స్వీడన్ లో ఎక్స్ పెడిషన్ రాబిన్సన్ పేరుతో ఒక షో ప్రసారమైంది. దీన్నే సర్వైవర్ పేరుతో చాలా దేశాల్లో నిర్మించారు. స్ట్రీమింగ్ సౌకర్యం వచ్చాక జెనిఫర్ రింగ్లే అనే ఆవిడ తన రోజువారీ పనులన్నీ వెబ్ ప్రేక్షకులకు అందించటం కూడా చాలామందిని ఆకట్టుకుంది. వీటన్నిటినీ కలిపి సృష్టించిందే బిగ్ బ్రదర్.

అయితే, దీనికి మొదట పెట్టుకున్న వర్కింగ్ టైటిల్ వేరే ఉంది. ఆ డచ్ పేరు తెలుగులో చెప్పాలంటే దానర్థం ‘బంగారు పంజరం’. వ్యవధి ఏడాది కాకుండా 100 రోజులకు కుదించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మించారు. కెమెరామెన్ ఉన్నట్టు హౌస్ మేట్స్ కు తెలియకుండా వాళ్ళ రాకపోకలకు బైటినుంచి దారి ఇచ్చి కెమెరాలు ఏర్పాటు చేశారు. వారానికి ఒక ఎపిసోడ్ అని ముందు అనుకున్నా, అన్నీ అనుకూలించి తగినంత కంటెంట్ వస్తూ ఉండటంతో డెయిలీ ఎపిసోడ్స్ గా ప్రసారం చేశారు.

ముసురుకున్న వివాదాలు

నెదర్లాండ్ లో ఉన్నప్పుడు అది స్థానిక కార్యక్రమంగానే గుర్తింపు పొందింది గాని అమెరికా వెళ్ళాక వివాదాలు, కోర్టు కేసులు మొదలయ్యాయి. నిజానికి భారత్ లో బిగ్ బాస్ అని పేరు పెట్టుకున్న ఈ కార్యక్రమం అసలు పేరు బిగ్ బ్రదర్. జార్జ్ ఆర్వెల్ రాసిన ‘1984’ నవలలో ‘బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ’ అంటూ పాలకుల నిఘానేత్రం గురించి మొదటి పేజీలోనే చెప్పటం అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పాపులారిటీని వాడుకొని ఆ పేరు ఖాయం చేసుకున్నారు. కానీ ఆర్వెల్ కు మాటమాత్రంగానైనా క్రెడిట్ ఇవ్వలేదు. ఈ డచ్ కార్యక్రమం అమెరికా చేరాక ఆర్వెల్ వారసులు ఎండెమాల్ సంస్థ మీద, అమెరికా టీవీ చానల్ సీబీఎస్ మీద కేసు వేశాక మాత్రమే పరిహారం ముట్టజెప్పి సర్దుబాటు చేసుకున్నారు. ఆ పరిహారం ఎంత అనే విషయం మాత్రం బైటికి రాలేదు.

అదే సమయంలో అమెరికాకు చెందిన కాస్టెవే అనే నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. సర్వైవర్ (ఎక్స్ పెడిషన్ రాబిన్సన్) పేరుతో వాళ్ళు నడిపే కార్యక్రమానికీ, బిగ్ బ్రదర్ కూ 12 పోలికలున్నాయని వాదించింది. అయితే, ఒక జానర్ లో అనేక కార్యక్రమాలు ఉండవచ్చునని, టీవీలో 20-30 గేమ్ షోలు , మరెన్నో టాక్ షోలు ఉన్నాయని ఎండెమాల్ వాదించి గెలిచింది. అనేక దేశాలలో పేర్లు మారినా ఇప్పటికీ తన భాగస్వామ్యంతోనే ఎండెమాల్ ఈ షో నడుపుతోంది.

నైతికత మీద చర్చ

నెదర్లాండ్స్ లో ఈ షో వివరాలు ప్రకటించినప్పుడు తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. ప్రైవసీని కాపాడటం గురించి, మానసికంగా వత్తిడికి గురయ్యే ప్రమాదం గురించి చర్చోపచర్చలు జరిగాయి. అదే సమయంలో స్వీడన్ లో ‘ఎక్స్ పెడిషన్ రాబిన్సన్’ కార్యక్రమంలో మొదటివారంలోనే ప్రేక్షకుల తిరస్కారానికి గురైన కంటెస్టెంట్ అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవటంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రసారం మీద కూడా నీలి నీడలు పడినా, క్రమంగా ప్రేక్షకాదరణ పొందటంతో నిరసన గొంతులు నీరసించాయి. కానీ అప్పుడప్పుడూ మళ్ళీ పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావటం, అవి తాత్కాలికం కావటం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.
విడిపోయిన పేయసి లేదా ప్రియుడు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిన తండ్రి ఎదురుపడితేనే ఎదుర్కోవటం కష్టమైతే హౌస్ మేట్ గా ప్రత్యక్షమైతే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఎక్స్ ఫాక్టర్ పేరుతో ఒక సీజన్ లో చేసిన ప్రయోగాన్ని అమెరికన్లు అక్కడి బిగ్ బ్రదర్ లో చూశారు. రకరకాల నేపథ్యం ఉన్నవాళ్ళు బాహ్యప్రపంచానికి దూరంగా ఒకచోట ఉన్నప్పుడు కొన్ని ఘటనలు అనివార్యమవుతాయి. కానీ అవి హద్దు మీరటం వలన చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎక్కువభాగం సరదాగా ఆటపాటలతో సాగినా, తీవ్రమైన సమస్యల్లో చిక్కున్న సందర్భాలలో చర్చ మొదలవటం అనేక సందర్భాలలో కనిపిస్తుంది.
అమెరికా బిగ్ బ్రదర్ లో క్రిస్టీన్ అనే నటి తన హౌస్ మేట్ కోడీతో అతి సన్నిహితంగా ఉండటం అభిమానులకు నచ్చలేదు. ఇలా షోస్ లో చేసే రొమాన్స్ ను షొమాన్స్ గా పిలుచుకోవటం అక్కడ మామూలే. కాకపోతే ఆమె వివాహిత కావటం వలన అదొక చర్చకు దారితీసింది. షో జరుగుతున్నప్పుడే ఆమె భర్త ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయటం, ఆమె ప్రవర్తన నచ్చలేదనటం పత్రికల్లో పతాకశీర్షిక అయింది. చివరికి వాళ్ళు విడాకులు తీసుకున్నారు కూడా.

మానసిక శాస్త్రవేత్తలకు దీనిమీద భిన్నాభిప్రాయాలున్నాయి. 1971 నాటి స్టాన్ ఫర్డ్ జైలు ప్రయోగాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తారు. కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులను ఎంపిక చేసి సగం మందిని ఖైదీలుగా, సగం మందిని గార్డులుగా పెట్టి రెండు వారాల పాటు వాళ్ళ ప్రవర్తనను గమనించటం ఈ ప్రయోగ లక్ష్యం. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్టు ధ్రువపరచుకున్న తరువాతనే వారికి అవకాశం కల్పించారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలోనే ఒక భవనాన్ని జైలును తలపింపజేసేలా తయారుచేసి అరెస్ట్, రిమాండ్ లాంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి జైల్లో వేశారు. నెంబర్ల కేటాయించి బట్టలు ఇచ్చారు. గార్డులకు కూడా యూనిఫాం ఇచ్చారు. ఖైదీలను నెంబర్లతో మాత్రమే పిలవాలని చెప్పారు. అయితే, ఈ ప్రయోగం వికటించింది. ఖైదీలను గార్డులు వేధించటం, ఖైదీలు పారిపోవాలని ప్రయత్నించటం ముందుగా ఊహించలేదు. పైగా గార్డులు అది ప్రయోగమని కూడా మరిచిపోయి అధికారం తలకెక్కించుకున్నారు. దీంతో రెండు వారాల ప్రయోగం వారానికే నిలిపేయాల్సి వచ్చింది. అసలైన స్వభావం అధికారం వల్ల మారిపోతుందని గ్రహించారు.
ఈ ఉదాహరణను బట్టి బిగ్ బ్రదర్ లో కూడా మానసిక సమస్యలు తలెత్త వచ్చునని కొంతమంది వాదించారు. కానీ ఆ ప్రయోగానికి అప్పటికే పాతికేళ్ళు నిండు ఉండటం వలన ఆలోచనావిధానంలో మార్పు ఉంటుందని సర్ది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా కార్యక్రమం ప్రారంభమైన తరువాత చర్చ అంతా మానవ సంబంధాలు, అవమానాలు, తిట్లు, సెక్స్ లాంటి విషయాల మీదికి మళ్ళింది. ఇదొక ప్రామాణిక టెలివిజన్ ప్రోగ్రామ్ గా గుర్తింపు పొండటంతో ఈ వాదోపవాదాలకు తెరపడింది.

కార్యక్రమంలో మార్పులు

బిగ్ బ్రదర్ ను కొత్తగా చూపించటం కోసం నెదర్లాండ్స్ లో వెరోనికా టీవీ బిగ్ బ్రదర్ వీఐపీ వెర్షన్ ను ప్రయత్నించింది. బాగా పేరు మోసిన డచ్ వీఐపీ లను ఆహ్వానించింది. అయితే, ఒక్కో గ్రూప్ లో ఐదేసి రోజులకు మించి వారు హౌస్ లో ఉండలేదు. ఆ విధంగా నాలుగు వారాలకే పూర్తవటం, అది కూడా రికార్డ్ చేసిందే కావటంతో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అందువలన ఎంత పెద్ద వీఐపీ లు పాల్గొన్నా అది రక్తకట్టలేదు. సహజంగానే రేటింగ్స్ తగ్గాయి. మొదట వచ్చిన ఆదరణ బాగా పడిపోయింది. దీంతో మళ్ళీ మామూలు పద్ధతిలోనే తరువాత సీజన్లు నడిచాయి.

2006 లో నెదర్లాండ్స్ లోనే మరో ప్రయోగం జరిగింది. ప్రాణాంతక వ్యాధులతోబాధపడే పిల్లల సంక్షేమం కోసం రెడ్ క్రాస్ కు విరాళాలు సేకరించటం ఈ ప్రత్యేక సీజన్ లక్ష్యం. సెలెబ్రిటీలు హోటల్ యజమాని గా వ్యవహరిస్తారు. వెబ్ సైట్ ద్వారా బైటివారు ఎవరైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులకు కూడా డబ్బు చెల్లించి రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్న సమయంలో టీవీలో అప్పుడప్పుడు కనిపిస్తారు. కానీ కొన్ని వారాల తరువాత సెలబ్రిటీలు రావటానికి మొగ్గు చూపక పోవటంతో నిలిపివేయాల్సి వచ్చింది. ప్రేక్షకులు కూడా ఏ మాత్రమూ ఆసక్తి చూపలేదు. రెడ్ క్రాస్ కూడా తగినంత డబ్బు రాలేదని అసంతృప్తికి లోనైంది.

విడివిడిగా గుర్తించటానికి వీల్లేని ఏకరూప కవలలను మార్చి మార్చి చూపిస్తూ మెదడుకు మేతవేసిన సీజన్ ఒకసారి, జంటలను ఎంపికచేసి మరోసారి కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. ఫిలిప్పైన్స్ లో టీనేజ్ యువతకు అవకాశమిచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరిని కూడా హౌస్ లో ఉంచారు. భారతదేశపు బిగ్ బాస్ లో 9వ సీజన్ లో కంటెస్టెంట్లను నడుముకు కట్టేసి జంటగా వచ్చేలా చేశారు. కుర్చీలు మొదలు మగ్గులు, స్పూన్ల దాకా కలిపే వాడుకోవాలి. ఆ తరువాత పన్నెండో సీజన్ లో టీచర్-స్టూడెంట్, పోలీస్-లాయర్, అక్కాచెల్లెళ్ళు జోడీలుగా పాల్గొనేట్టు చేశారు.

2016 లో సిబిఎస్ దీనిని తన ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికమీద ప్రసారం చేయటంతో మరో సరికొత్త నమూనాను ప్రేక్షకులకు పరిచయం చేసినట్టయింది. ఎడిట్ చేయకుండా ప్రత్యక్ష ప్రసారం చేయటం చాలామందిని ఆకట్టుకుంది. భారత్ లో కూడా ఓటీటీ వేదికల కోసం బిగ్ బాస్ ఓటీటీ నిర్వహించారు. వూట్, వూట్ సెలెక్ట్ వేదికలమీద ఇది అందుబాటులోకి వచ్చింది. నామినేషన్, శిక్షించటం లాంటివి ప్రేక్షకుల చేతిలో ఉండేట్టు చేయటం ఇందులో ప్రత్యేకత. ఆరువారాల పాటు సాగి 2021 సెప్టెంబర్ 18 న ఇది ముగిసింది.

భారత్ లో బిగ్ బాస్

భారత్ లో బిగ్ బ్రదర్ కు బిగ్ బాస్ అని పేరు పెట్టారు. మొదటి సీజన్ మాత్రమే సోనీలో ప్రసారం కాగా ఆ తరువాత సీజన్లు వయాకామ్ 18 వారి కలర్స్ చానల్ ద్వారా అందుతూ వచ్చాయి. ఈ పదిహేనేళ్ళలో 14 సీజన్లు నడిచాయి. అక్టోబర్ 2 న పదిహేనో సీజన్ మొదలు కాబోతోంది. విజేతకు ఇచ్చే బహుమతి మొదటి ఐదు సీజన్లలో కోటి రూపాయల చొప్పున ఉండగా ఆ తరువాత అది 50 లక్షలకు తగ్గించారు. సల్మాన్ ఖాన్ ఈ పదిహేనో సీజన్ తో సహా 11 సార్లు హోస్ట్ కాగా అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, శిల్పాశెట్టి, అర్షద్ వర్సీ ఒక్కో సీజన్ నడిపారు. 8 వ సీజన్ కొనసాగింపుకు ఫరా ఖాన్, బిగ్ బాస్ ఓటీటీ కి కరణ్ జోహార్ హోస్ట్ లుగా వ్యవహరించారు.

ఇక్కడా వివాదాలకు కొరతేమీ లేదు. రెండో సీజన్లో రాహుల్ మహాజన్ గోడ దూకటం, నాలుగో సీజన్ లో టీవీ నటులు సారా ఖాన్, అలీ మర్చంట్ షో లోనే పెళ్ళి చేసుకున్నందుకు వాళ్ళకు 50 లక్షలివ్వటం, ఏడో సీజన్ లో అర్మాన్ కోహ్లీ తనమీద దాడి చేశాడని బ్రిటిష్ గాయని సోఫియా హయత్ ఫిర్యాదు చేయటంతో సెట్ లోనే అతణ్ని పోలీసులు అరెస్ట్ చేయటం, హోస్ట్ సల్మాన్ ఖాన్ బెదిరించారంటూ జుబైర్ ఖాన్ అనే కంటెస్టెంట్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయటం లాంటివి కొన్ని ఘటనలు మాత్రమే. కొట్టుకోవటం, బూతులు తిట్టుకోవటం, ఒకరిమీద ఇంకొకరు ఉమ్మటం, మూత్రం పోయటం లాంటివి కోకొల్లలు.

నాలుగో సీజన్ నడుస్తున్న సమయంలో అసభ్యకరమైన సన్నివేశాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణల మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కలర్స్ చానల్ కు నోటీసు పంపింది. అలాంటి ప్రసారాలు రాత్రి 11.30 లోపు అనర్హమని పేర్కొంటూ. ప్రసార సమయాన్ని మార్చుకోవాలని చెప్పింది. అయితే, కలర్స్ యాజమాన్యం బొంబాయ్ హైకోర్టులో స్టే తెచ్చుకోవటం ద్వారా ప్రైమ్ టైమ్ లోనే కొనసాగించింది.

శివసేన హెచ్చరికల మధ్య శాంతిభద్రతల సమస్య రావచ్చునని పూణె జిల్లా కలెక్టర్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ సైతం ప్రభావం చూపలేకపోయింది. కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్న తమిళ బిగ్ బాస్ ని నిషేధించాలంటూ ఒకసారి, ముందుగా సెన్సార్ చేసిన తరువాతే ప్రసారం చేసేలా ఆదేశించాలని ఇంకోసారి మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనా షో ను నిలిపివేయాలన్న ఆదేశాలేవీ రాలేదు. ఆ తరువాత కూడా చాలా సార్లు బిగ్ బాస్ మీద ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు వేస్తూనే ఉన్నారు గాని షో మాత్రం ఎప్పుడూ ఆగిపోలేదు. నిషేధం కోరుతూ నిరుడు సుప్రీంకోర్టులో పీకే చౌహాన్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మీద ఇంకా విచారణ జరగాల్సి ఉంది.

ప్రాంతీయ భాషల్లోనూ

హిందీలో విజయవంతమవుతున్న సమయంలో వరుసగా ఆరు ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ మొదలైంది. 2013 లో కిచ్చా సుదీప్ హోస్ట్ గా మొదలైన కన్నడ బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 2013, 2016 లలో మిథున చక్రవర్తి, జీత్ హోస్ట్ లుగా నడిచిన బెంగాలీ బిగ్ బాస్ కు స్పందన కరవై నిలిచిపోయింది. కమల్ హాసన్ హోస్ట్ గా తమిళ బిగ్ బాస్ 2021 అక్టోబర్ 3 నుంచి ఐదో సీజన్ నడిచింది. 2018 లో మహేశ్ మంజ్రేకర్ హోస్ట్ గా మొదలైన మరాఠీ బిగ్ బాస్ 2021 సెప్టెంబర్ 19 నుంచి నడిచింది. మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిచేసుకుంది. మూడో సీజన్ చెన్నై శివార్లలో ఆఖరి వారం షూటింగ్ జరుగుతూ ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవటంతో అర్థాంతరంగా ముగిసింది. ప్రేక్షకుల వోట్ల ఆధారంగా ఆరు నెలల తరువాత విజేతను ప్రకటించాల్సి వచ్చింది. ఇక హిందీ తరువాత అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న బిగ్ బాస్ తెలుగులోనే నడిచింది. 2017 నాటి మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీయార్, రెండో సీజన్ కు నానీ హోస్ట్ లుగా ఉండగా మూడో ఎపిసోడ్ మొదలు ఇప్పటి ఆరో ఎపిసోడ్ దాకా నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ రూల్స్ కు భిన్నంగా ముమైత్ ఖాన్ షో మధ్యలోనే గ్యాప్ తీసుకొని డ్రగ్స్ కేసులో సిట్ ముందు హాజరు కావాల్సి వచ్చింది. అప్పట్లో ముంబయ్-పూణే మధ్య లోనావాలా లో బిగ్ బాస్ సెట్ ఉండగా అక్కణ్ణుంచి బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి హైదరాబాదు చేరుకున్న ముమైత్ విచారణ తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళి షోలో పాల్గొనటం తెలిసిందే. అలాంటి సందర్భం ఇంకెప్పుడూ రాలేదు.

సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ విజేత శిల్పాశెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి యుకె లో చానల్ 4 ప్రసారం చేసిన సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ -2007 లో పాల్గొన్నారు. అయితే అంతకు ముందు మూడో సీజన్ లో కూడా పాల్గొన్న టీవీ హోస్ట్ జేడ్ గూడీ మళ్ళీ ఈ సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ లో పాల్గొంటూ శిల్పాశెట్టి మీద జాత్యహంకార వ్యాఖ్యలు చేయటం పెనుదుమారం రేపింది. బ్రిటిష్ టీవీ షోలో పాల్గొన్న తొలిభారతీయురాలిగా అప్పటికే ఆమె ప్రత్యేకత చాటుకోగా, జేడ్ గూడీ వ్యాఖ్యలతో స్పాన్సర్లు కూడా తమ ఇమేజ్ దెబ్బతింటున్నదంటూ స్పాన్సర్షిప్ ఉపసంహరించు కున్నారంటేనే పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందో అర్థమవుతుంది. చానల్ 4 యాజమాన్యమే రేటింగ్స్ కోసం రెచ్చగొడుతున్నదన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

మరోవైపు ఇలాంటి సున్నితమైన అంశాలపట్ల మీడియా కూడా అనుచితంగా వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. బిగ్ బ్రదర్ షోస్ అన్నిటిలోనూ ఈ సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ 2007 అత్యంత వివాదాస్పదమైనదని పరిశ్రమ తేల్చేసింది. బ్రిటిష్ మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్ కామ్ కు దాదాపు 35 వేల ఫిర్యాదులందాయి. చానల్ కు విడిగా మరో మూడు వేల లేఖలు వచ్చాయి. గూడీ క్షమాపణలు చెప్పినా బ్రిటిష్ ప్రజలు ఆమెను క్షమించలేకపోయారు.
మొత్తం 90 లక్షలమంది ఈ కార్యక్రమం చూసినట్టు రేటింగ్స్ లెక్కలు చెబుతున్నాయి. అంటే, యుకె జనాభాలో 15% మంది చూశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా శిల్పాశెట్టి హుందాగా వ్యవహరించారని బ్రిటిష్ ప్రజలు అభిప్రాయ పడ్డారు. దీంతో ప్రముఖ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ కంటే ఎక్కువ వోట్లు తెచ్చుకొని శిల్పాశెట్టి విజేతగా లక్ష పౌండ్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

భారత్ లో బిగ్ బాస్ పేరుతో నడుస్తున్న ఇదే షో రెండో సీజన్ లో నటించటానికి పిలుపు రాగానే గూడీ సంతోషంగా ఒప్పుకున్నారు. గెస్ట్ హౌస్ మేట్ గా ఆమెను పిలిచారు. క్షమాపణ చెప్పుకునే అవకాశం దొరికిందనుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండగా లండన్ నుంచి ఆమె డాక్టర్ ఫోన్ చేశారు. అలా ఫోన్ అనుమతించటం రూల్స్ కు విరుద్ధమే అయినా తప్పలేదు. బయల్దేరే ముందు చేయించుకున్న వైద్య పరీక్షలు అప్పటికే ఆమెకు సర్వైకల్ కాన్సర్ బాగా ముదిరినట్టు తేల్చాయని డాక్టర్ చెప్పటంతో రెండో రోజే వెనుదిరిగారు. తరువాత కొద్ది రోజులకే తన 27వ ఏట గూడీ మరణించటం ఒక విషాదం. ఆ సీజన్ హోస్ట్ శిల్పాశెట్టి కావటం యాదృచ్ఛికం.

రాజకీయ వివాదాలు

బిగ్ బాస్ మీద రాజకీయ పార్టీల విమర్శలు కూడా చాలా ఉన్నాయి. 2019 లో బిజెపి ఎమ్మెల్యే నందకిశోర్ ఈ షో పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎవరితో కలిసి పడకలు పంచుకోవాలో నిర్ణయించటం భారతీయ సంస్కృతికే కళంకమని విమర్శిస్తూ షో రద్దుచేయాలని అప్పటి సమాచార, ప్రసార శాఖామంత్రికి లేఖ రాశారు. 2010 లో హిందీ నాలుగో సీజన్ సమయంలో ఇద్దరు పాకిస్తానీ కంటెస్టెంట్స్ వీణా మాలిక్, బేగం నవాజిష్ అలీ ని అనుమతించటం మీద శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కలర్స్ ఛానల్ కార్యాలయానికి ర్యాలీ జరిపి నిరసన తెలియజేసింది. ఒకదశలో లోనావాలా లోని బిగ్ బాస్ సెట్ ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించింది. నిరుడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు పెను సంచాలనానికి దారితీశాయి. బిగ్ బాస్ ప్రోగ్రాం ఒక బ్రోతల్ షో అని, ఇదొక క్యాన్సర్ లాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు దెబ్బతినేలా, పిల్లల బుర్ర పాడయ్యేలా ఈ షో ఉందని, నేరాలు పెరగడానికి ఇలాంటి షోలే కారణమవు తున్నాయని ఆరోపించారు. బయటికే అన్ని బూతులు కనిపిస్తుంటే, కనిపించకుండా ఇంకా ఏం జరుగుతోందో అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆరో సీజన్ మొదలవగానే సీపీఐ నారాయణ మళ్ళీ అవే విమర్శలతో దాడికి దిగారు.- face book lo
-తోట భావనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ రాసిన వ్యాసం..ఇదే నిజం పాఠకుల కోసం.

Recent

- Advertisment -spot_img