– సీబీఐను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
– ఎంపీ రఘురామ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థాంలో విచారణ
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం.. కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానందరెడ్డి, పి.శరత్‌చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. పదేళ్లుగా నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ‘సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు.అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి’అని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు.