బిట్కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూలోని ఓ నివాస ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది.
ముంబయికి చెందిన ‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ స్కామ్ మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్లానింగ్ వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్ చేసింది.