Homeఫ్లాష్ ఫ్లాష్మహిళలకు వరంగా వర్క్‌ఫ్రమ్‌ హోం

మహిళలకు వరంగా వర్క్‌ఫ్రమ్‌ హోం

కొవిడ్‌-19 నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ప్రాధాన్యత పెరిగింది.

కుటుంబ అవసరాల కోసం కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారుసైతం తిరిగి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

గతంతో పోల్చితే ఆన్‌లైన్‌ జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 37 శాతం అధికంగా పెరిగిందని టీమ్‌ లీజ్‌ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

సంస్థల నిర్వహణ ఖర్చు తగ్గింది

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వ్యాపార, వాణిజ్య సంస్థలకు, ముఖ్యంగా ఐటీ సంస్థల యాజమాన్యాలకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నది.

ఉదాహరణకు ఒక ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆఫీస్‌ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులకు మౌలిక వసతుల కల్పన, తదితర వాటికి నెలకు లక్షల్లో ఖర్చవుతుంది.

ఐటీ ఉద్యోగులే కాకుండా సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్‌బాయ్‌లు, స్వీపర్లు ఇలా రకరకాల విభాగాలకు సిబ్బందిని నియమించుకోవాల్సిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వల్ల కార్యాలయాల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గింది.

కేవలం ఒక చోట కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి ఎక్కడి నుంచి.. ఎక్కడికైనా సేవలను అందించే దిశగా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

అందుకోసం అవి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటూ తమ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించుకుంటున్నాయి.

ఇప్పుడిదే అతివలకు వరంగా మారుతున్నది. ఐటీ రంగంలోనే కాదు, డ్యాన్స్‌, టీచింగ్‌, డేటా ఎంట్రీ, బీపీవో, టైపింగ్‌ తదితర రంగాల్లోనూ అవకాశాలు పెరిగాయి.

కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు

ఇప్పటి వరకు నైపుణ్యాలున్నా.. దూరభారం, ఇంటి, కుటుంబ అవసరాల వల్ల ఎంతో మంది మహిళలు తమకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న సంస్థల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు అలాంటి మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వరంగా మారింది.

కంపెనీలు కూడా ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని ఆఫర్లు ఇస్తుండటంతో ఇలాంటి వారికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతున్నది.

దీంతో కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారు కూడా తిరిగి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.

అవిశ్రాంత శ్రమకు చెల్లుచీటి..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం మహిళల అవిశ్రాంత శ్రమకు చెల్లుచీటి పలికింది. శారీరకంగా ఎంతో ఉపశమనాన్ని కలుగజేస్తున్నది.

ఒక సర్వే రిపోర్టు ప్రకారం 24గంటల సమయంలో గృహ అవసరాల కోసం సుమారు 4 నుంచి 8 గంటల సమయాన్ని స్త్రీ వెచ్చిస్తుండగా.., పురుషుడు కేవలం 97 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నాడంటే ఇంట్లో అతివల పాత్రను అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగాలు నిర్వహించే మహిళలు అందరికంటే ముందుగానే లేచి ఇంటి పని, వంటపని పూర్తిచేసుకుని, ఆఫీసుకు ప్రయాణం చేసి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చాక కూడా మళ్లీ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి.

ఇలా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఎన్‌ఎస్‌వో నిర్వహించిన 75వ రౌండ్‌ హెల్త్‌ ఇండియా సర్వేలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం మహిళలకు కొంత ఊరటనిస్తున్నది.

ఇటీవల టీమ్‌ లీజ్‌ అనే సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం గతంతో పోల్చితే ఆన్‌లైన్‌ జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 37శాతం అధికంగా పెరిగింది.

మహిళల నుంచి ఆదరణ పెరుగుతున్నది..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వ్యాపార, వాణిజ్య సంస్థలకు, ముఖ్యంగా ఐటీ సంస్థల యాజమాన్యాలకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతున్నది.

అందుకే ప్రతి ఐటీ కంపెనీ 40శాతం మంది ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేయించాలని కోరుకుంటుంది.

దీంతో ప్రయాణ భారం తప్పుతుంది. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తున్నది.

మరీ ముఖ్యంగా మహిళలకు ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం వరంలా మారింది.

కెరీర్‌ను మధ్యలో వదిలేసిన వారు కూడా తిరిగి ఉద్యోగాలు చేసేందుకు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. – చిన్న ఓబుల్‌రెడ్డి జీ, డిస్క్‌ టెక్నాలజీ, తెలంగాణ ఆపరేషనల్‌ హెడ్‌

బ్యాలెన్స్‌ చేసుకుంటేనే..

వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం చాలా బాగుంది. ఇది తమకు(మహిళలకు) నచ్చిన రంగంలో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నది.

అయితే వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ సమయాన్ని రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రణాళికతో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. – రమ్యశ్రీ, సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌

Recent

- Advertisment -spot_img