Homeహైదరాబాద్latest Newsకేంద్ర బడ్జెట్ లో వ్యవ'సాయం' దారుణం

కేంద్ర బడ్జెట్ లో వ్యవ’సాయం’ దారుణం

ఇదేనిజం, లక్షెట్టిపేట: వ్యవసాయ, అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపుల్లో భారీ కత్తిరింపులు, అత్తెసరు ప్రతిపాదనలు.. ఇవీ ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌ తీరు. ఎరువుల సబ్సిడీకి పెద్ద ఎత్తున కేటాయింపులు తగ్గించారు. ప్రధాన మంత్రి గరీబీ కళ్యాణ్‌ యోజన అమలు చేస్తామంటూనే ఆహార సబ్సిడీకి భారీగా కోత పెట్టారు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించే ఉపాధి హామీకి బొటాబొటిగా నిధులు ప్రతిపాదించారు. పంటల బీమా, పిఎం కిసాన్‌, ఇలా అన్ని పథకాలదీ ఇదే పరిస్థితి. ఎన్‌డిఎ సంకీర్ణ సర్కారు బడ్జెట్‌లో తొమ్మిది ప్రాధాన్యతలను పేర్కొనగా, వాటిలో మొదటిది వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత పెంపు. ఎరువుల సబ్సిడీ, ఆహార సేకరణ సబ్సిడీ, ఉపాధి హామీలకు నిధులివ్వకుండా ఏ విధంగా పంటల ఉత్పాదకత పెరుగుతుందో అర్థం కాదు. ఈ తడవ బడ్జెట్‌లో రైతుల ఆదాయాల రెట్టింపుపై మాట్లాడలేదు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)లను గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళనలు చేస్తుండగా బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. స్వామినాథన్‌ సిఫారసుల అమలును వదిలేసినట్లు కనిపిస్తోంది. ఎంఎస్‌పి లేని పంట ఉత్పత్తుల ధరలు తగ్గిన పక్షంలో మార్కెట్‌లో జోక్యం చేసుకునే స్కీంలను పూర్తిగా ఎత్తేశారు. ఆ స్థానంలో కార్పొరేట్లకు ఆస్కారం కలిగించే, సేకరణలో ప్రభుత్వ పాత్ర లేకుండా, ప్రైవేటు జోక్యానికి ఆస్కారం కలిగించే ‘పిఎం-ఆశా’ పథకానికి బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించారు.

ముఖ్య స్కీంల ప్రతిపాదనలు
ఏడాదికి మూడు కిస్తుల్లో రూ.6 వేలు రైతులకు ఇచ్చే పిఎం కిసాన్‌కు రూ.60 వేల కోట్లే ప్రతిపాదించారు. నిరుడు కూడా అంతే కేటాయించారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌కు (ఫసల్‌ బీమా) 14,600 కోట్లు చూపించారు. గతేడాది కంటే 400 కోట్లు తక్కువ కేటాయించారు. రైతు రుణాలపై వడ్డీ రాయితీకి రూ.22,600 కోట్లు, ఆర్‌కెవివైకి 7,553 కోట్లు, డ్రోన్లకు 500 కోట్లు ప్రతిపాదించారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌కు కేటాయింపులు సున్నాగా చూపించారు. ‘పిఎం-ఆశా’కు 6,437 కోట్లు ప్రతిపాదించారు. జౌళి శాఖ పద్దులో రైతుల నుంచి ఎంఎస్‌పిపై పత్తి కొనుగోలు కోసం సిసిఐకి రెండేళ్ల నుంచి ప్రతిపాదనలు లేవు. ఈసారి 600 కోట్లు ప్రతిపాదించారు. ముఖ్యంగా ఎరువుల సబ్సిడీని బాగా తగ్గించారు. యూరియా సబ్సిడీకి ప్రభుత్వం 2022-23లో 1,65,217 కోట్లు ఖర్చు చేయగా, నిరుడు బడ్జెట్‌లో 1,31,099 కోట్లు ప్రతిపాదించి, 1,28,596 కోట్లకు సవరించారు. ఇప్పుడు 1,19,000 కోట్లు కేటాయించారు. పోషక ఆధారిత ఎరువుల సబ్సిడీకి 2022-23లో 86,122 కోట్లు ఖర్చు చేయగా, నిరుడు 44,000 కోట్లు ప్రతిపాదించి 60,300 కోట్లకు సవరించారు. ఇప్పుడు 45,000 కోట్లు ప్రతిపాదించారు. సబ్సిడీ తగ్గిన పక్షంలో డిఎపి, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం మాత్రం ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయానికి, నానో వైపు రైతులను మళ్లించి ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలని చూస్తోంది.

‘సంస్కరణ’ల వేగం
వ్యవసాయ పరిశోధనల్లో, నూతన వంగడాల అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తారు. త్వరలో 109 కొత్త వంగడాలను విడుదల చేస్తారు. రెండేళ్లల్లో ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులను మళ్లిస్తారు. సేంద్రీయ ఉత్పత్తులకు బ్రాండింగ్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. పంచాయతీలు, శాస్త్ర సాంకేతిక సెంటర్ల ద్వారా అమలు చేస్తారు. రైతులు, సహకార సంఘాలతో పాటు ప్రైవేటు స్టార్టప్‌లతో కూరగాయల క్లస్టర్లు నెలకొల్పుతారు. ఇంకా పప్పులు, నూనెగింజలల్లో స్వయం సమృద్ధి సాధిస్తారు. నాబార్డు ద్వారా రొయ్యల సాగు నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరుస్తారు. పది వేల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పిఒ)లను నెలకొల్పుతారు. ‘నమో డ్రోన్ల’ పథకం కింద సాగులో డ్రోన్లను ప్రవేశపెడతారు. గ్రామీణ ఆర్థిక, ఉపాధి కల్పన కోసం జాతీయ సహకార విధానం తీసుకొస్తారు. సహకారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనిది కాగా ఎన్‌డిఎ సర్కారు జాతీయ విధానం తెచ్చి తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోంది. సహకార శాఖ మంత్రిగా అమిత్‌షా వ్యవహరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img