- భారీ వర్షానికి కూలిన ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రూఫ్
- ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- సహాయక చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలు
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు విమానాల బంద్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గత రాత్రి నుంచి దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్టులోని టెర్మినల్–1డి పైకప్పు కూలిపోయింది. రూఫ్ షీట్‌తోపాటు దానికి సపోర్టింగ్‌గా ఉన్న పిల్లర్లు ఈ తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్చర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.20లక్షల ఆర్థికసాయం…
విమానాశ్రయం పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించారు. టెర్మినల్ వన్ వద్ద ఉన్న ప్రయాణీకులందరికీ వెంటనే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.20లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు.
ఎడతెరిపి లేకుండా వర్షం…
ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్లు, బైకులు నీటమునిగాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.