పాతికేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ (తమిళంలో ఇండియన్) సినిమా అప్పట్లో ఒక సంచలనం.
అవినీతిపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసిన సరికొత్త పోరాటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కమలహాసన్ అభినయం.. దర్శకుడు శంకర్ ప్రతిభ చిత్రాన్ని ఎక్కడికో తీసుకుపోయాయి.
ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఆమధ్య మొదలైన సంగతి విదితమే.
కమల్, కాజల్ జంటగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ జరిగింది.
అయితే, ఈ సినిమా సెట్స్ లో ప్రమాదం జరిగి కొందరు టెక్నీషియన్లు మరణించడం.. తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ ఆలస్యమైంది.
ఆ తర్వాత ఇక షూటింగ్ మొదలవుతుందనగా చిత్ర నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదం చెలరేగి వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది.
దర్శక, నిర్మాతలను సామరస్యంగా పరిష్కరించుకోమంటూ కోర్టు సూచించింది.
అయితే, ఇంతవరకు ఇది పరిష్కారం కాలేదు. ప్రాజక్టు మధ్యలోనే ఆగిపోయింది.
ఇదే విషయంపై తాజాగా హీరో కమల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
దర్శక, నిర్మాతల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కారించేందుకు తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నానని కమల్ చెప్పారు.
అరవై శాతం వరకు సమస్య పరిష్కారమైందనీ, త్వరలోనే మొత్తం సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను చేస్తున్న ‘విక్రమ్’ సినిమా తర్వాత ఈ ‘ఇండియన్ 2’ షూటింగ్ కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.