సాధారణంగా కొందరు యువకులు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుకుంటారు.
అదేవిధంగా కొంతమంది యువతులు కూడా తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉంటే బాగుండునని అనుకుంటారు.
కానీ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇందుకు భిన్నంగా జరిగింది. అక్కడ కూడా ఒక యువతి బాయ్‌ఫ్రెండ్ కావాలని కోరుకున్నది.
కానీ ఆ బాయ్ ఫ్రెండ్ తన కోసం కాదని, తన 51 ఏండ్ల అత్త కోసమని అందరినీ షాక్‌కు గురిచేసింది.
అందుకోసం ఏకంగా ఆమె సోషల్ మీడియాలో ప్రకటన కూడా ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా వయసు మళ్లిన స్త్రీగానీ, పురుషుడుగానీ జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరి అయినప్పుడు మానసికంగా కుంగిపోతుంటారు.
కాబట్టి అత్యంత అరుదుగా కొందరు పిల్లలు వాళ్ల పెద్దవాళ్లకు తోడు కోసం పెండ్లిళ్లు చేస్తుంటారు.
కానీ, న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఈ యువతి మాత్రం తన అత్తకు జీవితాంతం తోడు కావాలని కోరుకోలేదు.
కానీ ఎవరైనా కేవలం రెండు రోజులు మాత్రం తన అత్తకు బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటే చాలని భావించింది.
40-60 ఏండ్ల మధ్య వయస్కులు అర్హులట..!
అనుకున్నదే తడవుగా సదరు యువత సోషల్ మీడియాలో ఆ యువతి ప్రకటన చేసింది.
ఆ ప్రకటనలో ‘మేము కుటుంబసమేతంగా మా స్నేహితురాలు వివాహానికి వెళ్తున్నాం.
అక్కడ రెండు రోజులు ఎంజాయ్‌గా గడపదల్చుకున్నాం. కానీ, మా అత్త వితంతువు.
ఈ రెండు రోజులు ఆమె ఒంటరి తనాన్ని ఫీల్ కాకుండా ఆనందంగా గడపడానికి ఒక తోడు కావాలి.
51 ఏండ్ల వయసున్న మా అత్తకు రెండు రోజులు బాయ్‌ఫ్రెండ్‌గా గడపదల్చుకుంటే 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులు సంప్రదించవచ్చు’ అని ఉంది.
రెండు రోజులకు రూ.72 వేలట..!
అంతేకాదు.. రెండు రోజులపాటు తన అత్తకు బాయ్‌ఫ్రెండ్‌గా వ్యవహరించే వ్యక్తికి 960 అమెరికన్ డాలర్‌లు (సుమారు రూ.72,000) పారితోషికంగా చెల్లిస్తానని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నది.
అయితే, ఈ ఆఫర్‌తోపాటు తన అత్తకు కాబోయే బాయ్‌ఫ్రెండ్‌కు సదరు యువతి కొన్ని కండిషన్‌లు కూడా పెట్టింది.
డ్యాన్స్ చేయడం వచ్చి ఉండాలని, చక్కగా నవ్విచేలా మాట్లాడే నేర్పు ఉండాలని, అవసరమైతే పాటలు కూడా పాడాలని ప్రకటనలో పేర్కొన్నది.
ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు..!
ఇక, ఆడుతూపాడుతూ రోజుకు రూ.36,000 ఆదాయం కూడగట్టకునే అవకాశం ఉన్న ఈ పోస్టును ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి.
అందుకే బాయ్‌ఫ్రెండ్ పోస్టు కోసం దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయట.
ఇప్పుడు ఆ దరఖాస్తుల్లో నుంచి కోడలు ఎవరిని తన అత్తకు బాయ్‌ఫ్రెండ్‌గా సెలెక్ట్ చేస్తుందనేదే ఆసక్తికరంగా మారిందట.
కానీ కొంతమంది మాత్రం సదరు యువతి పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రకటన ఇచ్చిందని పెదవి విరుస్తున్నారు