సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హైకమాండ్ అనుమతితోనే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి ముఖ్యమైన శాఖలున్నాయి. నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంకా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
నెల చివరిలో కెబినేట్ విస్తరణ ఉండొచ్చనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి వర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాం కు అవకాశం ఇవ్వాలనేది సీఎం రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి కోదండరాంకు ఖరారైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కొదండరాంకే దక్కుతుంది.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, కోదండరాం కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.