– దేవినేని ఉమ మీద కూడా..
– మరో 20 మందిపై హత్యాయత్నం
chandrababu: ఇదేనిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి సెగ్మెంట్ ముదివేడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఇటీవల అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు సహా 20 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితోపాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. మరికొందరు టీడీపీ నేతలపైనా కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ములకలచెరువులోనూ కేసు..
ములకలచెరువు పీఎస్‌లోనూ చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు షోలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్త చాంద్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబును ఏ7గా పేర్కొన్నారు. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి గంట నరహరితో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.