CM KCR:అందని చంద్రుడిని, చుక్కలను ఎట్లాగూ అందివ్వలేరు..కనీసం అందుబాటులో వున్న నీరు, విద్యుత్తునైనా దేశ రైతాంగం కోసం 75 ఏండ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులు ఎందుకు అందించలేకపోతున్నారని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర పాలకులను ఈ దిశగా నిలదీసేలా ప్రతీ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరమున్నదని పునరుద్ఘాటించారు. బుధవారం మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో రైతులు, ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు విద్యుత్తు నేటికీ అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఏలుతున్న పాలకులకు చిత్తశుద్ధిలోపం వల్లనే ప్రజలకు నష్టం జరుగుతున్నదన్నారు. “చాంద్ సితారో చోడో..పానీ బిజిలీ జోడో” అని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ చురకలంటించారు.
బీఆర్‌ఎస్‌లోకి వ్యాపమ్ హీరో
కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్‌రాయ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్‌టీఐ, గిరిజన హక్కుల పోరాటయోధుడిగా ఆనంద్‌రాయ్‌కు దేశవ్యాప్తంగా పేరున్నది. మధ్యప్రదేశ్ ప్రజల అభిమాన నాయకుడు ఆయన. సామాజిక కార్యకర్తగా మధ్యప్రదేశ్ ప్రజలు ఆరాధానాభావంతో చూస్తారు. గిరిజనుల హకుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసీ యువశక్తి సంఘటన్’ (జాయ్స్) అనే ప్రముఖ గిరిజన హకుల వేదిక బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది మధ్యప్రదేశ్ లో ఆదివాసీ, గిరిజనుల హకుల కోసం పోరాడుతున్న ప్రఖ్యాత సంస్థ. ఆనంద్‌రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు జేఏవైఎస్ ప్రస్తుత అధ్యక్షుడు లాల్‌సింగ్ బర్మన్, పంచంభీల్, అశ్విన్ దూబే, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.