– స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్లో పంచాయితీ క్లోజ్
– ఒక్కటైన రాజయ్య, కడియం
– చక్రం తిప్పిన మంత్రి కేటీఆర్
– ఫలించిన పల్లా చొరువ
compromise between Rajaiah and Kadiam: ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్లో అసమ్మతి చల్లారింది. ఉప్పు, నిప్పులా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ నియోజకవర్గంలో ఉన్న కీచులాటలు తగ్గిపోయాయి. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మల్యే తాటికొండ రాజయ్య.. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. రాజయ్యను పక్కకు పెట్టి.. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య తీవ్రంగా నొచ్చుకున్నారు. నియోజకవర్గంలో అస్సలు మద్దతు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హైకమాండ్ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పినా ఆయన వినలేదు. తాజాగా శుక్రవారం మంత్రి కేటీఆర్ .. ఈ ఇద్దరు నేతలను పిలిపించి సముదాయించారు. తాటికొండ రాజయ్యకు పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు నేతలు మంత్రి సమక్షంలోనే ఒక్కటయ్యారు.
రంగంలోకి కేటీఆర్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడ కొన్ని సెగ్మెంట్లలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఘన్పూర్లో నెలకొన్న సమస్యలను మంత్రి పరిష్కరించారు. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్యను కుదిర్చారు. ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను సీఎం కేసీఆర్ పక్కకు పెట్టారు. ఈ దఫా కడియం శ్రీహరి కి టిక్కెట్ కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక దశలో అటు కడియం శ్రీహరి, ఇటు రాజయ్య ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్టేషన్ గులాబీ రాజకీయాలు చిందరవందరగా మారాయి. ఈ ఇద్దరు నాయకుల వ్యవహారం ప్రజల్లోనూ గులాబీ పార్టీ ప్రతిష్టను దిగజార్చే వైపు నెట్టబడ్డాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన అధిష్ఠానం ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత కుదిరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతో కడియం, తాటికొండ ఒక్కటయ్యారు. మంతి కేటిఆర్ సమక్షంలో ఇద్దరు నేతలు కలిసిపోయారు.