– కేంద్రంలో సపోర్ట్ చేస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు
– ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటుతాం
– ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ వల్లే బీజేపీ కేంద్రంలో గెలుస్తున్నదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ విజయానికి తాను ఎలా బాధ్యుడిని అవుతానని, కాంగ్రెస్ పార్టీయే బీజేపీ విజయానికి కారణమని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్తోనే మొదలైందని, గాంధీభవన్ రిమోట్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చేతిలో ఉందన్నారు. ఏదిఏమైనా బీజేపీతో తన పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం.. హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపిందన్నారు. కానీ ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, తిరిగి స్థానాలన్నీ తిరిగి కైవసం చేసుకుంటామన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామని పేర్కొన్నారు.