The corona epidemic is unfolding again. The growing number of cases is worrying. Telangana health department is already on high alert as cases are on the rise in neighboring states.
కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
పొరుగు రాష్ర్టాల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఇప్పటికే అప్రమత్తమైంది.
మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.
సరిహద్దు జిల్లాల అధికారులకు సూచనలు ఇస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకల వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు.
ఎక్కడికక్కడే చెకింగ్
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
ఎక్కడైనా రెండుమూడు కేసులు నమోదు కాగానే బ్లాక్ స్పాట్స్‌గా గుర్తిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచారు.
రోగుల కుటుంబసభ్యులను క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరిస్తున్నారు.
చెక్‌పోస్టులు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాలకు ఇటీవల వెళ్లివచ్చినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో కొత్త కేసులతోపాటు పాజిటివిటీ రేటు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది.
మహారాష్ట్రలో రోజూ 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. కరోనా మరణాల విషయంలోనూ ఈ రాష్ట్రాలు ముందున్నాయి.
బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చినవారిలో యూకే స్ట్రెయిన్ గుర్తించినట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాల్లో పెరుగుతున్న కేసులు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగదలతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,828 పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 15,818కు పెరిగిందని డీఎంహెచ్‌వో సుదర్శనం తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 709 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ చెప్పారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 13,637 కేసులు నమోదయినట్టు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం 9 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భాస్కర్‌నాయక్ వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో 642 మందికి పరీక్షలు చేస్తే ఒకరికి పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్యాధికారి బీ మాలతి తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో గురువారం 956 పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
నల్లగొండలో జిల్లాలో గురువారం 12 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్యారోగ్య అధికారి సూధాకర్‌షిండే చెప్పారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం వైరస్ అదుపులోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 192 కొత్త కేసులు వెలుగు చూశాయి.
హైదరాబాద్‌లో 50, రంగారెడ్డి జిల్లాలో 96, మేడ్చల్‌లో 46 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ప్రజలు మాస్కు, శానిటైజర్లు, తప్పనిసరిగా వాడాలని, గుంపులుగా ఉండరాదని సూచించారు.