కరోనా పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా కనిపించడం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా అధ్యయనం ప్రకారం.. మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం కానుంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేట్లు పెరుగుతూ ఉంటే ఇండియాలో మాత్రం తగ్గుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఫిబ్రవరిలో ఇండియా రికవరీ రేటు అత్యధికంగా 97.3 శాతానికి చేరింది.
అయితే అప్పటి నుంచీ సెకండ్ వేవ్ మొదలు కావడంతో క్రమంగా తగ్గుతూ తాజాగా 85 శాతానికి చేరడం గమనార్హం.
ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరినప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది.
ఫిబ్రవరి 15 నుంచి పీక్ టైమ్‌ను 96 రోజులుగా అంచనా వేసినట్లు ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కాంతి ఘోష్ వెల్లడించారు.
ఆ లెక్కన మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతానికి రోజువారీ కేసులను పరిశీలిస్తే కిందట రోజు కంటే కనీసం 15 వేల కేసులు ఎక్కువ వస్తున్నాయి.
మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య ఓ స్థాయికి చేరి అక్కడే స్థిరంగా ఉండిపోయింది.
కానీ యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో మాత్రం కేసులు సంఖ్య పెరిగిపోతోంది.
మహారాష్ట్ర పీక్ ఆగిపోయింది కాబట్టి.. అక్కడి నుంచి రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గరిష్ఠానికి తాకి అక్కడే స్థిరంగా ఉండే అవకావం ఉన్నట్లు ఎస్‌బీఐ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా వాస్తవిక జీడీపీ 10.4 శాతంగా ఉండనున్నట్లు ఎస్‌బీఐ అంచనా వేసింది.
రోజుకు కరోనా కేసులు మూడు లక్షలకు వరకూ చేరవచ్చని గతంలోనే ఎస్‌బీఐ అంచనా వేసింది.
అందుకు తగినట్లే ఇప్పుడు కేసులు అంతకు మించి నమోదవుతున్నాయి.