ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో పోలీసు వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థపైనా, హోంశాఖపైనా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారని అన్నారు. హోం శాఖ విఫలమైందని ఇవాళ డిప్యూటీ సీఎం స్వయంగా చెప్పారు. బయటికి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారని, డీజీపీకి డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదని డిప్యూటీ సీఎం అంటున్నారు. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలను హత్య చేస్తున్నారు.. మహిళలపై అత్యాచారాలు, దారుణాలు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో 33 వేల మంది మహిళలు తప్పిపోయారని పవన్ కల్యాణ్ గతంలో వ్యాఖ్యానించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఒక్క మహిళనైనా తీసుకొచ్చారా.. నేరాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలిని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు మడత పెట్టి కొట్టకూడదన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడో అది చేస్తాడంట.. పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.