Endangered Languages in India which is not in records : భారతదేశంలో రికార్డులకెక్కని అంతరించిపోతున్న భాషలెన్ని..
అది 2010 సంవత్సరం. ప్రొఫెసర్ గణేశ్ దేవి ఒక విషయం గురించి మథనపడుతుండే వారు.
భారతదేశంలో భాషలకు సంబంధించి సమగ్రమైన సమాచారం లేదన్నది ఆయన ఆవేదన.
”1961 జనాభా లెక్కల్లో భారత దేశంలో 1652 భాషలున్నట్లు తేలింది. కానీ 1971 వచ్చేనాటికి కేవలం 109 భాషలే లెక్కకు వచ్చాయి.
ఇది నన్ను నిశ్చేష్టుడిని చేసింది” అన్నారు గణేశ్.
అందుకే మిగిలిన భాషలు ఏమయ్యాయో తెలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
భాషా పరంగా భారతదేశం అత్యంత వైవిధ్యమున్న ప్రాంతం.
అందుకే పెన్సిల్వేనియాలోని స్వాత్‌మోర్ కాలేజీలో భాషావేత్తగా పని చేస్తున్న డేవిడ్ హారిసన్ ఇండియాను ”లాంగ్వేజ్ హాట్‌స్పాట్”గా అభివర్ణించారు
ఇక్కడి చాలా భాషలు అంతరించే స్థితిలో ఉన్నాయని, వాటికి సంబంధించిన రికార్డులు కూడా తక్కువేనని హారిసన్ అభిప్రాయపడ్డారు.
గుజరాత్‌లోని ‘ది మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా’లో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గణేశ్ దేవికి భాషల మీద ఆసక్తి ఎక్కువ.
వీటి అధ్యయనం కోసం ఆయన అనేక సంస్థలను కూడా స్థాపించారు.
బరోడాలో ‘భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’, తేజ్‌గఢ్‌లో ‘ఆదివాసీ అకాడమీ’ లాంటివి ఇందులో కొన్ని.
ఈ సంస్థల పనులు, భాషా అధ్యయనం కోసం గణేశ్ దేవీ తరచూ గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
ఈ సందర్భంగా ఆయన పలు తెగలకు ప్రత్యేకంగా భాషలున్నాయని, కానీ, ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లో కనిపించడం లేదని గుర్తించారు.
”ఆదివాసీలు, సంచార జాతులు, వెనకబడిన తరగతుల ప్రజలకు చెందిన చాలా భాషలు ప్రభుత్వ రికార్డులో చేరడం లేదని నాకు అర్దమైంది” అన్నారు గణేశ్ దేవీ.
భారతదేశంలో ఉన్న ఇన్ని భాషలను రికార్డులకు ఎక్కించడం కష్టం.
అందుకే ఆయన దీనికి సహాయ పడేందుకు ముందుకు వచ్చారు. 2010లో ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ (పీఎల్‌ఎస్ఐ) అనే సర్వేను ప్రారంభించారు.
ఇందుకోసం దేశవ్యాప్తంగా 3000 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరిలో చాలామంది భాషా పరిశోధకులు కాదు.
కొందరు రచయితలను, టీచర్లు, నాన్ ప్రొఫెషనల్ భాషావేత్తలను మాత్రం ఎంచుకున్నారు.
వీరికి వారి సొంత భాషతో సాన్నిహిత్యం ఉండటం గణేశ్ దేవి సర్వేకు కలిసొచ్చింది.
2010-2013 మధ్య నిర్వహించిన సర్వేలో, దేవీ, ఇంకా ఆయన బృందం దేశవ్యాప్తంగా 780 భాషలు, 68 లిపులను రికార్డ్ చేశారు.
సుదూరంగా లేదంటే సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్నందుల వల్ల దాదాపు 100 భాషలను డాక్యుమెంట్ చేయడం సాధ్యం కాలేదని దేవి చెప్పారు.
అంటే భారతదేశంలో ఉన్న మొత్తం భాషలు ఎన్నిఅనే విషయంలో పూర్తి సమాచారం ఇంకా రహస్యమేనన్న మాట.
2013 నుండి ‘పీపుల్స్ లాంగ్వేజ్ సర్వే ఆఫ్ ఇండియా’ తాము గుర్తించి ప్రతి భాషకు సంబంధించిన ప్రొఫైల్‌తో 68 సంపుటాలను ప్రచురించింది.
మిగిలిన 27 సంపుటాలు 2025 నాటికి ప్రచురితం కానున్నాయి.
నాలుగు భాషలు మాట్లాడే డ్రైవర్
తూర్పు రాష్ట్రమైన ఒడిశాను భాషల బంగారు గనిగా చెబుతారు. కానీ, ఇక్కడి మారుమూల ప్రాంతాలలో భాషలను రికార్డు చేయగల వ్యక్తి గణేశ్ దేవికి దొరక లేదు.
ఈ సమయంలో ఆయనకు ఒడిశాలో జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర పని చేసే ఓ టాక్సీ డ్రైవర్ తారసపడ్డారు.
జిల్లా మేజిస్ట్రేట్ గ్రామాల్లో సందర్శనకు వెళ్లినప్పుడల్లా, ఆ డ్రైవర్ కారులో కాలక్షేపం చేయకుండా గ్రామస్తులతో మాట్లాడేవారు.
” అలా కొన్ని సంవత్సరాలలో ఆయన నాలుగు భాషలపై పట్టు సంపాదించారు. వాటికి వ్యాకరణం కూడా రాశారు.
జానపద గేయాలు, కథలను సేకరించారు” అని గణేశ్ దేవి చెప్పారు. ”డాక్టరేట్ ఇవ్వగల మెటీరియల్ ను ఆయన సేకరించారు.
ఒకటి కాదు రెండు డాక్టరేట్లు ఇవ్వొచ్చు” అన్నారు దేవి.
తన ప్రయత్నంలో ఇలాంటి వారు అనేకమంది గణేవ్ దేవికి తారసపడ్డారు.
గుజరాత్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ రాజస్థాన్‌లోని వేరే భాష నుండి ఒక పురాణాన్ని డాక్యుమెంట్ చేశారు.
దీనికి ఆయనకు 20 సంవత్సరాలు పట్టింది. సొంత డబ్బుతోనే ఆయన ఈ పని చేశారు.
”నాకు అర్ధమైంది ఏంటంటే, భాషలను నేర్చుకోవడం, ప్రేమించడం డబ్బుకు సంబంధించిన వ్యవహారం కాదు” అన్నారాయన.
తమ పనులకు డబ్బులు సమకూర్చుకోవడం ఎలాగో పరిశోధకులకు బాగా తెలుస్తుందని, నిజమైన భాషా ప్రేమికులు తమకు పెద్దగా చదువులు లేకపోయిన విలువైన సమాచారం సేకరిస్తారని, అలాంటి వారు ఎందరో తనకు పరిచయమయ్యారని గణేశ్ దేవి అన్నారు.
అండమాన్ లో అంతరించిన భాషలు
భాషల పట్ల సామాన్యులకు ప్రేమ ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లలో 220 భాషలు అంతరించిన పోయినట్లు దేవి అంచనా వేశారు.
ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలు మాట్లాడే భాషలను అత్యంత ప్రమాదంలో ఉన్న భాషలుగా భాషావేత్తలు భావిస్తున్నారు.
2003లో, కెనడాలోని సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయంలో భారతీయ అధ్యయనాల సందర్శన ప్రొఫెసర్ అన్విత అబ్బి ‘వానిషింగ్ వాయిసెస్ ఆఫ్ ది గ్రేట్ అండమానీస్’ (వోగా) అనే ప్రాజెక్టును చేపట్టారు.
అండమానీస్ తెగపై అబ్బి చేసిన అధ్యయనం భారతదేశంలో ఆరో భాషా కుటుంబం ఉందన్న విషయాన్ని బయటపెట్టింది.
దీనిని గ్రేట్ అండమానీస్ భాషా కుటుంబం అంటారు. ఈ భాషా కుటుంబంలోని భాషలను అండమాన్ దీవులలో నివసించే స్థానిక ప్రజలు మాట్లాడతారు.
గ్రేట్ అండమానీస్ ప్రాంతంలోని ప్రధాన భాషలైన సారే, బో, ఖోరా, జెరు అనే భాషలను అబ్బి నేర్చుకున్నారు.
‘బో’ భాషను మాట్లాడగల ఏకైక వ్యక్తి 2010లో అండమాన్ దీవులలో మరణించారు. ‘బో’ భాష ప్రపంచంలోని అతి పురాతన భాషలలో ఒకటి.
దీనిని నియోలిథిక్ పూర్వకాలపు భాషగా చెబుతారు.
‘బో’ భాషతోపాటు ఖోరా, సారె భాషలను మాట్లాడే వ్యక్తులు కూడా మరణించారు. దీంతో ఆ భాషలు అంతరించిపోయినట్లయింది.
”ఈ భాషలను రక్షించడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. ప్రభుత్వాలకు చాలా లేఖలు రాశాం.
కానీ ఎవరూ వినిపించుకోలేదు. ఇలాంటివి భాషావేత్తలను నిస్పృహకు గురి చేస్తాయి” అని అబ్బీ అన్నారు.
గ్రేట్ అండమానీస్ భాషలను అధ్యయనం చేయడంలో, డాక్యుమెంట్ చేయడంలో చేసిన కృషికి అన్విత అబ్బీ 2013లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు.
భాషను రక్షించుకునే సామాన్యులు
అయితే, అంతరించిపోతున్న తమ భాషలను సంరక్షించుకునేందుకు కొన్ని కమ్యూనిటీలు కూడా బాధ్యత తీసుకుంటాయి.
అలాంటి ఒక ప్రయత్నాన్ని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ గ్రామానికి చెందిన రైతు వాంగ్లంగ్ మొసాంగ్ చేపట్టారు.
మొసాంగ్ ఈశాన్య భారతదేశంలోని అనే సినో-టిబెటన్ భాష కుటుంబానికి టాంగ్సా అనే భాషను మాట్లాడే తెగకు చెందిన వారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని టాంగ్సా తెగ 40 ఉపజాతులుగా కనిపిస్తుంది. ప్రతి ఉపజాతికి దాని సొంత యాస ఉంటుంది.
టాంగ్సా కమ్యూనిటీ జనాభా దాదాపు 100,000. అయితే విభిన్న మాండలికాల కారణంగా భాషా అంతరించిపోయే ప్రమాదంలో పడింది.
“నేను మా కమ్యూనిటీ పెద్దలతో కూర్చుని మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు వినని అనేక పదాలు వినిపించేవి” అని మొసాంగ్ చెప్పారు.
“ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగించి ఈ పదాలను రాయాలనుకున్నాను. వాక్య నిర్మాణంలో వ్యత్యాసాల వల్ల చాలా కష్టమైంది” అన్నారాయన.
అంతకు ముందు 1990 లో టాంగ్సా కమ్యూనిటీలోని అన్ని తెగల వారు ఉపయోగించే సాధారణ లిపిని లఖుమ్ మొసాంగ్ అనే వ్యక్తి కనుగొన్నారు.
(వీరిద్దరికీ బంధుత్వం లేదు) 2020లో లఖుమ్ మొసాంగ్ మరణించిన తర్వాత టాంగ్సా భాషను పరిరక్షించే బాధ్యతను వాంగ్లంగ్ మొసాంగ్ స్వీకరించారు.
ఈ ఏడాది ఆరంభంలో కాలేజీ విద్యార్థులకు సెలవులు ఉన్నప్పుడు రెండు వారాల పాటు సాయంత్రం క్లాసులు ఏర్పాటు చేసి, వారికి టాంగ్సా లిపి నేర్పించారు మోసాంగ్.
”2019 లో టాంగ్సా లిపి పరిరక్షణ కోసం ఒక స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ కమిటీని రూపొందించాం.
ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాలలో టాంగ్సా లిపిని ప్రవేశపెట్టడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది.
వారు మా ప్రతిపాదనను అంగీకరించడం మాకు సంతృప్తినిచ్చింది” అని మొసాంగ్ చెప్పారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున టాంగ్స లిపి పుస్తకాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఇప్పుడు టాంగ్సా రైటింగ్ సిస్టమ్‌ను మైక్రోసాఫ్ట్ ఫాంట్ స్టైల్‌గా కూడా గుర్తించింది.
అయితే, ఇంకా అనేక ఇతర భారతీయ భాషలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నాయి.
”సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం గురించి ప్రజలు పెద్దగా దృష్టి పెట్టరు. మన ప్రజలకు గిరిజన భాషలను నేర్పించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వర్క్‌షాప్‌లు నిర్వహించాలి.
కానీ ఈ పనులు మనమే చేయలేము. ఆర్థిక సహాయం, ప్రభుత్వ సహాకారం అవసరం”అని మొసాంగ్ చెప్పారు.
అంతరించి పోతున్న భాషల సంరక్షణ
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2013 లో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకం (ఎస్‌పిపిఇఎల్)ను ప్రారంభించింది.
అంతరించి పోతున్న, భవిష్యత్తులో అంతరించి పోయే ప్రమాదం ఉన్న భాషలను డాక్యుమెంట్ చేయడం దీని లక్ష్యం.
అంతరించిపోతున్న భాషలను డాక్యుమెంట్ చేయడానికి అలాంటిదే ఒక ప్రోగ్రామ్‌ను సిక్కిం యూనివర్సిటీలోని అంతరించిపోతున్న భాషల కేంద్రం తీసుకుంది. ఈ కేంద్రాన్ని 2016లో స్థాపించారు.
2017లో ‘సిక్కిం-డార్జిలింగ్ హిమాలయాస్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఆర్కైవ్’ (సిధేలా)కు చెందిన పరిశోధకురాలు హిమ క్టీన్ ‘రాయ్-రోక్‌డంగ్’ అనే తెగను గుర్తించారు.
వీరి భాష ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రాంత భాషా చరిత్రలో ఇంతకు ముందు ఈ భాష ప్రస్తావన ఎక్కడా లేదు.
అప్పటి నుండి, కేవలం 200 మంది జనాభా ఉన్న ఈ తెగ భాషపై పరిశోధన కొనసాగుతోంది.
అయితే రాయ్-రోక్‌డంగ్ భాష మాట్లాడగలిగే 20 మందిని మాత్రమే గుర్తించగలిగామని హిమ క్టీన్ చెప్పారు.
”స్కూళ్లలో ఒక భాషను బోధించకపోతే, దాన్ని ఉపయోగించే అవకాశం ఉండదు.
ప్రజలు మెజారిటీ ప్రజల భాషను స్వీకరించడం ద్వారా ఆ సమాజంలో కలిసి పోవడానికి ప్రయత్నిస్తారు” అని క్టీన్ అన్నారు.
రాయ్-రోక్‌డంగ్ కమ్యూనిటీ గురించి పరిశోధన సాగిస్తున్నప్పుడు క్టీన్, ఆమె బృందం ఆ తెగలోని పెద్దలతో మాట్లాడారు.
అయితే, వారు కేవలం ఇంట్లో మాత్రమే రోక్‌డంగ్ భాష మాట్లాడతారని తేలింది.
తాతలు తమ కొడుకులతో ఈ భాష మాట్లాడుతుండగా, ఇంట్లోని పిల్లలు మాత్రం రోక్‌డంగ్ కాకుండా ఎక్కువగా నేపాలీలో మాట్లాడతారు.
అయితే, తన పరిశోధన ముగింపులో తానొక మంచి విషయాన్ని గుర్తించానని క్టీన్ చెప్పారు.
రోక్‌డంగ్ భాషను నిలబెట్టుకోవాలన్న తపన ఉన్నవారు ఆ కమ్యూనిటీలో ఉన్నారని, వాళ్లంతా వారానికొకసారి సమావేశం కావడాన్ని గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.
పెద్దతరం వ్యక్తులు తమ కొడుకులకు ఈ భాషను వారసత్వంగా అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా నేర్చుకున్న వారిలో తమ భాషపై ఆపేక్ష ఉన్నవారు దాన్ని తమ పిల్లలకు అందించే అవకాశం ఉంటుంది.
”భాషను డాక్యుమెంట్ చేసే ప్రయత్నంలో ఉండగా మా నుంచి స్ఫూర్తి పొంది కొందరు తమ భాషను నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాకు చాలా సంతృప్తినిచ్చింది” అన్నారు హిమ క్టీన్