– ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ
– అభినందనలు తెలిపిన బీఆర్ఎస్,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. నాలుగు రోజుల విరామం అనంతరం నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్ పదవికి ప్రసాద్‌కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.