Gati Shakti Launching by pm modi today : దేశ ముఖచిత్రాన్నే మార్చే మాస్టర్ ప్లాన్.. 100 లక్షల కోట్లతో గతి శక్తి..
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఆవిష్కరించనున్నారు.
దేశంలో మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్నారు.
దేశ మౌలిక వసతుల ముఖచిత్రాన్ని గతి శక్తి సమూలంగా మార్చేస్తుందని అంటున్నారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా 100 లక్షల కోట్ల ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఇవాళ ఆవిష్కరిస్తారు.
మౌలిక రంగంలో సమూలంగా మార్పులు చేసి, శాఖల మధ్య సమన్వయంతో గతిశక్తిని చేపట్టనున్నారు.
ఈ పనులను 2024-25 సరికి పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అనుమతుల్లో జాప్యాన్ని నివారించి మౌలిక వసతుల నిర్మాణాన్ని సంపూర్ణంగా, వేగంగా కొనసాగించడానికి గతిశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది.
గతి శక్తిని పూర్తిచేసిన తర్వాతే 2024 ఎన్నికలకు వెళ్లాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్’ అనేది జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్.
దీని ద్వారా ప్రతి రంగంలో అభివృద్ధి పనులను ప్రచారం చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్రం బలంగా నమ్ముతోంది.
భారత వ్యాపార రంగంలో పోటీ తత్వం పెంచడంతో పాటు కనెక్టివిటీ పెరిగేలా టెక్స్‌టైల్, ఫార్మాసూటికల్ క్లస్టర్స్, డిఫెన్స్ కారిడార్, ఎలక్ట్రానిక్ పార్క్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫిషింగ్ క్లస్టర్స్, అగ్రి జోన్స్ ఇందులో కవర్ అవుతాయి.
పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు గతి శక్తి ఉపయోగపడనుంది.
ఈ ప్రాజెక్టు వలన ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా సాఫీగా సాగిపోతుంది. ఎక్కడా ఇబ్బందులు ఉండవు.
చివరి మైలు వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తద్వారా ప్రయాణ సమయం తగ్గుతుంది.
ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు.. 2024-25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి.
వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి.
ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి? అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే వివరాలను పొందుపరుస్తారు.
తద్వారా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకునేందుకు పెట్టుబడిదారులు సులభమవుతుంది.