Until four years ago, petrol and diesel together sold between seven and eight thousand liters a day. But in recent times sales have dropped from fifteen hundred to two thousand liters.
The reason for this is not the declining number of vehicles in the area. With petrol being cheaper in Nepal than in India, smuggling across the border has increased. Locals are coming to Nepal in their vehicles and filling up with petrol and diesel.
భారత్, నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బీహార్ రాష్ట్రంలోని రాక్సౌల్ పట్టణంలో యుగల్ కిశోర్ షికారియా 30 ఏళ్లుగా పెట్రోల్ బంకు నడుపుతున్నారు.
నాలుగేళ్ల క్రితం వరకూ పెట్రోల్, డీజిల్ కలిపి రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల లీటర్ల దాకా అమ్ముడయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో అమ్మకాలు పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్లకు పడిపోయాయి.
దీనికి కారణం ఈ ప్రాంతంలో వాహనాలు తగ్గిపోవడం కాదు. భారత్ కన్నా నేపాల్‌లో పెట్రోల్ చౌకగా దొరకడంతో సరిహద్దుల వెంబడి అక్రమ రవాణాలు పెరిగిపోయాయి. స్థానికులు తమ వాహనాల్లో నేపాల్ వెళ్లి పెట్రోల్, డీజిల్ నింపుకుని వస్తున్నారు.
నేపాల్ పారిశ్రామిక రాజధానిగా పేరు పొందిన వీర్‌గంజ్ సమీపంలో భారత రాక్సౌల్ సరిహద్దుల దగ్గర 1,360 లీటర్ల పెట్రోల్ తరలిస్తున్న ట్యాంకర్లను రక్షక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
“సరిహద్దులు చాలా మటుకు తెరిచే ఉంటాయి. అందుకే స్మగ్లర్లు పెద్ద పెద్ద డ్రమ్ములతో, క్యాన్లతో పెట్రోలు, డీజిల్‌ను భారత్‌కు అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే పెద్ద ట్రక్కులు, ట్యాంకర్లతో రోడ్డు మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికులకు నేపాల్ వెళ్లి వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడం సులభం. భయంతో వెళ్లలేని వారు అక్రమంగా తరలిస్తున్నవారి దగ్గర కొనుక్కుంటున్నారు” అని యుగల్ కిశోర్ చెప్పారు.
భారత్‌లో ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, సరిహద్దుల్లో అక్రమ రవాణా నివారించకపోతే చుట్టు పక్కల పెట్రోల్ పంపులన్నీ మూతపడతాయని కిశోర్ ఆందోళన వ్యక్తం చేశారు.
వీర్‌గంజ్‌లో గత శనివారం నాటి ధరలు పరిశీలిస్తే లీటర్ డీజిల్ భారత్ కంటే నేపాల్‌లో రూ.27.50 తక్కువగా ఉంది. పెట్రోల్ ధర రూ.23 తక్కువగా ఉంది.
నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?
నేపాల్ పెట్రోలియం ఉత్పత్తులన్నీ భారత్ నుంచే కొనుగోలు చేస్తుంది.
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం భారత్ నుంచి 71,673 కిలోలీటర్ల చమురు కొనుగోలు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) భారతదేశంలో దాని భాగస్వామ్య సంస్థ. సరిహద్దుల్లోని నేపాల్ ప్రాంతాలకు సరఫరా, పంపిణీ కూడా ఐఓసీ చేస్తుంది.
అయినా సరే, నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ఎందుకు చౌకగా లభ్యమవుతున్నాయి?
“ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను ఇండియా, నేపాల్ కూడా ఒకే ధరకు కొంటాయి. అయితే, నేపాల్‌లో చమురుపై పన్ను విధానం వేరుగా ఉంటుంది. నేపాల్‌లో దేశ వ్యాప్తంగా చమురుపై ఒకటే టాక్స్ ఉంటుంది. కానీ ఇండియాలో మొదట ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తారు. తరువాత రాష్ట్రాల్లో వ్యాట్ (VAT) వసూలు చేస్తారు. నేపాల్‌లో ఒక పన్ను ఉంటుంది గానీ అది మన ఎక్సైజ్ డ్యూటీ కన్నా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, భారత్ నుంచి నేపాల్‌కు శుద్ధి (రిఫైన్) చేసిన చమురునే సరఫరా చేస్తారు” అని యుగల్ కిశోర్ వివరించారు.
నేపాల్‌లో ప్రస్తుతం లీటరు ఇంధనంపై సుమారు రూ. 40 పన్ను వసూలు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ, పెట్రోలియం ఇన్‌ఫ్రాస్టక్చర్, రోడ్ల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన టాక్సులన్నీ ఇందులో కలుస్తాయి.
కానీ, భారత్‌లో ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్ అన్నీ కలిపి పన్ను రూ.50లకు పైనే ఉంటుంది.
అక్రమ రవాణా ఎలా జరుగుతోంది?
సరిహద్దు ప్రాంతాల్లో భారత్ నుంచి నేపాల్ వెళ్లడం చాలా సులువు. అలాగే అటు నుంచి ఇటు రావడానికి కూడా ఏ ఆటంకాలూ లేవు.
భారతీయులు నేపాల్‌లోకి ప్రవేశించడానికి అక్కడి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇస్తుంది కానీ, అది సందర్శకులకు మాత్రమే.
నేపాల్‌తో వ్యాపార సంబంధాలు, చుట్టరికాలు ఉన్న స్థానిక ప్రజలకు ఈ షరతులేమీ అడ్డు రావు. అంతే కాకుండా, సరిహద్దుల్లో అంతా తెరిచే ఉంటుంది కాబట్టి నేపాల్ చేరుకోడానికి వేల మార్గాలు ఉంటాయి.
రాక్సౌల్, వీర్‌గంజ్ లాంటి ప్రాంతాల్లో నేపాలీ నంబర్ ప్లేట్లు, భారత్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు కనిపిస్తూనే ఉంటాయి.
“పొలిమేర్లలో 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లకు అటూ ఇటూ రాకపోకలు సాగించడం ఏ మాత్రం కష్టం కాదు. కానీ, ప్రధాన మార్గం గుండా వెళ్లడానికి భయపడుతుంటారు. ఎందుకంటే నేపాల్ ప్రభుత్వం షరతుల్లేని ప్రవేశానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. కానీ సరిహద్దులు దాటి అటు వెళ్లడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. స్థానికులకు అవి బాగా తెలుసు. స్మగ్లర్లు ఆ మార్గాల గుండా పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణా చేస్తుంటారు. సరిహద్దు దాటడానికి సాధారణ ప్రజలకు షరతులున్నాయి గానీ పెద్ద పెద్ద వాహనాలు అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాయి. లాక్‌డౌన్ సమయంలో కూడా పెద్ద వాహనాలు వస్తూ పోతూనే ఉన్నాయి” అని స్థానిక్ జర్నలిస్ట్ అభిషేక్ పాండే తెలిపారు.
భారత్ నుంచి ఏ వాహనం అటువైపు వెళ్లినా చమురు నింపుకుని వస్తుందని అభిషేక్ చెప్పారు.
స్మగ్లింగ్ ఎలా చేస్తారో ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న ట్యాంకర్ చూస్తే తెలుస్తోంది. ఇటు నుంచీ వెళ్లే వాళ్లు అక్కడ పెట్రోల్ పంప్ యజమానులతో డీల్ పెట్టుకుంటారు. వీళ్లను పట్టుకోవడం పోలీసులకు కూడా కష్టమే. ఎందుకంటే ట్యాంకర్ లోపల ఏముందో తనిఖీ చేయడం కుదరదు.
నేపాల్ చేరుకోవడానికి ప్రధాన మార్గం గుండా ప్రైవేట్ వాహనాలలో వెళ్లడానికి స్థానికులు భయపడుతుంటారు గానీ కాలి నడకన లేదా టెంపోల్లో పొలిమేర్లు దాటడానికి ఎలాంటి అడ్డూ ఉండదు.
అక్కడ వందలకొద్దీ టెంపోలు బారులు తీరి కనిపిస్తాయి. రూ. 25 ఇస్తే వీర్‌గంజ్‌లోని ఘంటాఘర్ చౌక్‌కి తీసుకెళతాయి.
అక్కడ మూడు చెక్ పోస్టులు ఉన్నాయి గానీ రక్షణ అధికారులు వస్తువులను మాత్రమే తనిఖీ చేస్తారు. వచ్చేపోయేవాళ్లు భారతీయులా, నేపాలీలా అనేది చూడరు.
“ఎంతమందిని ఆపుతాం? వీళ్లకి అక్కడేదో వ్యాపారం ఉంటుంది లేదా బంధువులు ఉంటారు. వీళ్లల్లో చాలామంది రోజూ అటునుంచి ఇటు, ఇటునుంచి అటూ వెళ్లేవాళ్లే. చాలామందితో ముఖ పరిచయం ఉంటుంది. మేము వాళ్లని గుర్తు పడతాం” అని ఒక చెక్ పోస్ట్ వద్ద జవాన్ చెప్పారు.
నేపాల్‌లో పెట్రోల్ పంపుల పరిస్థితి ఎలా ఉంది?
సరిహద్దుల దగ్గర ఇటువైపు భారత్‌లో పెట్రోల పంపుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కానీ, అటువైపు నేపాల్‌లో పెట్రోల్ పంపులు కళకళలాడుతున్నాయి.
వీర్‌గంజ్ సమీపంలో ఉన్న శ్రీ దుర్గా ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర భారత నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు కనిపించాయి. కొంతమంది గ్యాలన్లల్లో పెట్రోల్ నింపుకుని వెళుతున్నారు.
భారత నంబర్ ప్లేటు ఉన్న మోటర్ సైకిల్‌లో పెట్రోలు నింపుకుంటున్న ఒక వ్యక్తి ఏమన్నారంటే.. “నేను రాక్సౌల్‌లో ఉంటున్నాను. బోర్డర్ దాటి ఇటు రావడానికి ఏ ఇబ్బందీ లేదు. మేము రోజువారీ ప్రయాణికులం. ఇక్కడ మా వ్యాపారం ఉంది. ఇక్కడ పెట్రోల్ రూ.23 తక్కువగా ఉన్నప్పుడు భారత్‌లో ఎందుకు పెట్రోల్ నింపుకోవాలి? ఇక్కడికొచ్చి ట్యాంక్ నింపేసుకుంటే ఒక వారం పాటూ ఏ సమస్యా ఉండదు”.
అయితే నేపాల్‌లో పెట్రోల్ పంపులు భారతీయుల వాహనాల్లో పెట్రోల్ నింపడానికి ఎందుకు అంగీకరిస్తున్నాయి?
ఈ విషయంపై మాట్లాడడానికి అక్కడ పని చేస్తున్నవారు అంగీకరించలేదు.
ప్రభుత్వం దీన్ని ఆపలేదా?
నేపాల్ నుంచీ పెట్రోల్, డీజిల్ స్మగ్లింగ్ చేయడం వలన ఇండియాలో సరిహద్దు ప్రాంతల్లోని పెట్రోల్ పంపుల్లో అమ్మకాలు 70% తగ్గిపోయాయి.
ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
“బోర్డర్ దగ్గర చెక్ పోస్టులను అప్రమత్తం చేశాం. కరోనా కారణంగా బోర్డర్ దగ్గర సాధారణ కదలికలు చాలామటుకు నిలిచిపోయాయి. కేవలం ట్యాంకర్లు, ట్రక్కులకు ప్రధాన మార్గం తెరిచి ఉంచాం. ట్యాంకర్ల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచీ తనిఖీలు పెరిగాయి. అంతే కాకుండా, సరిహద్దుల వద్ద కాపలా ఉండే సాయుధ దళాలను అప్రమత్తం చేశాం. ఒక్కసారి కూడా అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం” అని శశాస్త్ర సీమా బల్ (బోర్డర్ ఫోర్స్) కమాండర్ ప్రియవ్రత్ తెలిపారు.
అయుతే, బీబీసీ చిత్రీకరించిన దృశ్యాలు మరో కథ చెబుతున్నాయి.
ఆ విజువల్స్ చూస్తూ.. “వాటిని మాకివ్వండి. మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం” అని కమాండర్ ప్రియవ్రత్ అన్నారు.
“స్మగ్లింగ్ గురించి పలు వార్తలు వస్తున్నాయి. అక్రమ రవాణా జరుగుతోంది కూడా. కానీ చెక్ పోస్టుల దగ్గర సాయుధ దళాలు దీన్ని నిలువరించాల్సి ఉంటుంది” అని తూర్పు చంపారణ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శీర్షత్ కపిల్ అశోక్ అన్నారు.
రాక్సౌల్ బోర్డర్ దగ్గర అనేక రకాలుగా అక్రమ రవాణా జరుగుతోంది. కొంతమంది ట్యాంకర్ నుంచీ డ్రమ్ముల్లోకి, గ్యాలన్లలోకి పెట్రోల్ నింపుకుంటున్నారు. బీబీసీ ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తుంటే వారు పారిపోయారు.