కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి.
బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు కరోనా వైరస్ విజృంభణ ఎక్కువ అయిన నేపథ్యంలో ఇప్పుడు రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిదని చెబుతున్నారు.
ఈ క్రమంలో అసలు ఏ మాస్క్ ఎప్పుడు వాడాలి? మాస్క్ వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి మాస్కులు ఎంచుకోవాలి?
- సర్జికల్ మాస్క్ అయినా క్లాత్ మాస్క్ అయినా మూడు లేయర్లు ఉన్నవే ఎంచుకోవాలి.
- బట్ట మాస్కులను ఎంచుకున్నప్పుడు సులభంగా శ్వాస తీసుకునేందుకు వీలు ఉండే మాస్కులను తీసుకోవాలి.
- మాస్క్ మొహం నిండా సరిపోయేలా ఉండాలి. అంటే ముక్కు, నోరు, గడ్డం భాగం పూర్తిగా కవర్ అయ్యేలా ఉండాలి.
- ముక్కు దగ్గర స్ట్రిప్ ఉండే మాస్కులను ఎంచుకోవడం మంచిది. ఈ స్ట్రిప్ ఉండటం వల్ల బయట గాలిని మనం పీల్చుకోకుండా జాగ్రత్త పడొచ్చు.
- చిన్నారులకు.. రెండేళ్లలోపు చిన్నారులకు మాస్క్ అవసరం లేదు. రెండేళ్లు దాటిన చిన్న పిల్లలకు బట్ట మాస్క్‌ను ఎంచుకుంటే అవి వారి ముఖానికి ఫిట్ అయి బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి.
- మాస్క్ పెట్టుకునేముందు, తీసిన తర్వాత కచ్చితంగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
- మాస్క్ పెట్టుకునేందుకు లేదా తీసేప్పుడు కేవలం మాస్క్‌కు ఉన్న దారాన్ని మాత్రమే పట్టుకోవాలి. మాస్క్‌ను పట్టుకోకూడదు.
- తరచూ మాస్క్‌ను పట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మాస్క్‌ను పట్టుకోవాలన్నా చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
- మనం పెట్టుకునే మాస్క్ కచ్చితంగా ముక్కు, నోరు, గడ్డం భాగాన్ని కవర్ చేసేలా ఉండాలి.
- మొఖానికి సరిపోయేలా ఫిట్‌గా ఉండాలి.
మాటిమాటికీ తీయొద్దు
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే.. తిరిగి ఇంటికి వచ్చేవరకు మాస్క్‌ను తీయొద్దు. కొంతమంది ఫోన్‌లో మాట్లాడేప్పుడు, బండిపై వెళ్లేటప్పుడు ఇలా పలు సందర్బాల్లో మాస్క్‌ను గడ్డం కిందకు అంటుంటారు. అలా చేయడం వల్ల మాస్క్ పెట్టుకుని ప్రయోజనం ఉండదు.
మాస్కుల విషయంలో జాగ్రత్త
బట్టతో తయారుచేసిన మాస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం కాబట్టి మాస్క్ ధరించినప్పుడు చెమట పట్టేస్తుంది. అయితే బట్ట మాస్కులు తొందరగానే చెమటను పీల్చేస్తాయి. కాకపోతే అలా చెమటతో నిండిన మాస్కులతో అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. చెమటతో తడిచిన మాస్కులపై క్రిములు, బ్యాక్టీరియా కూడా త్వరగా చేరతాయి. కాబట్టి చెమట పట్టిన మాస్కులను వెంటనే తీసేయాలి.
సరిగ్గా శుభ్రపరచాలి
మాస్క్‌ను వాడటమే కాదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకసారి మాస్క్‌ను ఉపయోగించిన తర్వాత డెటాల్ వేసిన వేడి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మాస్క్‌ను ఉతికి ఎండలో ఆరేయాలి. ఉతికాం కదా అని ఒకరి మాస్క్ మరొకరు వాడకూడదు.