MBBS in Abroad : ఫారిన్లో ‘చీప్’గా ఎంబీబీఎస్ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..
- బురిడి కొట్టిస్తున్న కన్సల్టెన్సీలు
- విదేశాల్లోని నాసిరకం మెడికల్ కాలేజీల్లో సీట్లు
- ఇక్కడికొచ్చాక ఎఫ్‌ఎంజీఈ పాస్ కాలేక తిప్పలు
- అండర్‌గ్రాడ్యుయేట్లుగా మిగిలిపోతున్న వేల మంది
- తక్కువ జీతానికి క్లినికల్ అసిస్టెంట్లుగా ఎల్లదీత
- తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్న ఎక్స్‌పర్ట్స్
- నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న ఎన్‌ఎంసీ
- కొత్తగా ‘రెండేండ్ల’ నిబంధనఎగ్జిట్ ఎగ్జామ్‌లో 2 లెవల్స్
MBBS in Abroad : నీట్ రిజల్ట్ వచ్చిరాగానే తక్కువ మార్కులతో క్వాలిఫై అయిన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల చుట్టూ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టన్సీలు చక్కర్లు కొడుతున్నయి.
విదేశాల్లో అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని ఏజెంట్లు తల్లిదండ్రులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ ఏజెన్సీల మాయలో పడి ఏటా మన రాష్ట్రం నుంచి 3 నుంచి 4 వేల మంది స్టూడెంట్లు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు.
కానీ, ఇందులో సగం మంది అండర్ గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు.
ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నా.. ఇక్కడికొచ్చాక నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ పాస్ కాలేకపోతున్నారు.
ఈ ఎగ్జామ్ పాస్ కాకుంటే, విదేశాల నుంచి తెచ్చుకున్న ఎంబీబీఎస్ పట్టా పనికిరాదు.
ఆ పట్టాతో ఇక్కడ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉండదు.
చివరి ఐదు ఎఫ్‌ఎంజీ ఎగ్జామ్స్‌లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజ్ 30 శాతం దాటలేదు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చిన వేల మంది అటు డాక్టర్లు కాకపోగా, ఇటు ఇంకే వృత్తికీ నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.
చాలా దేశాల్లో మెడికల్ విద్య ఒక వ్యాపారంగా మారిపోవడమే ఇందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
తమ పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించదల్చుకున్న తల్లిదండ్రులు, ఏజెంట్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆయా దేశాల్లో చదివి వచ్చిన స్టూడెంట్ల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెబుతున్నారు.
ఎఫ్‌ఎంజీఈ మస్ట్ (MBBS in Abroad)
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చాక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్(FMGE) రాయాల్సి ఉంటుంది.
ఈ ఎగ్జామ్ పాస్ అవకుండా డాక్టర్‌గా ఎన్‌ఎంసీ రిజిస్ర్టేషన్ పొందలేరు.
యూకె, ఆస్ర్టేలియా, కెనడా, న్యూజీలాండ్, అమెరికా దేశాల్లో చదివిన విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈ రాయనవసరంలేదు.
ఆ దేశాల్లో వైద్య విద్య ప్రమాణాలు ఇండియాలో కంటే బాగుంటాయని, అక్కడి చదివినోళ్లకు ఈ పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.
మిగతా ఏ దేశంలో చదివినా ఎఫ్‌ఎంజీఈ పాస్ కావాల్సిందే. ఎఫ్‌ఎంజీఈ పాస్ అయ్యాక ఇండియాలోనే ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తేనే డాక్టర్‌గా ఎన్‌ఎంసీ పూర్తిస్థాయి గుర్తింపునిస్తుంది.
అరిగోస..
ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్‌లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జాబినేషన్స్(ఎన్‌బీఈ) ఎఫ్‌ఎంజీఈ నిర్వహిస్తుంది.
300 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్‌లో, కనీసం 50% మార్కులు తెచ్చుకుంటేనే పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తారు.
కానీ, చాలా మంది ఈ ఎగ్జామ్ పాస్ కాలేక తిప్పలు పడుతున్నారు.
2014 నుంచి 2018 వరకూ 64,647 మంది పరీక్ష రాస్తే, కేవలం 8917 మంది మాత్రమే పాసయ్యారు.
2019 నుంచి పాస్ పర్సంటేజ్ 20 నుంచి 30 మధ్య ఉంటుండగా, 70 నుంచి 80 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు.
అంటే, ప్రతిసారి పరీక్షకు సగటున 15 నుంచి 17 వేల మంది అటెండైతే, అందులో 3 వేల నుంచి 4 వేల మంది మాత్రమే పాస్ అవుతున్నారు.
ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక, వందల మంది తమ చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు.
కొంత మంది ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లో అత్తెసరు జీతానికి క్లినికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు.
ఇది కూడా దొంగచాటు ఉద్యోగమే.. దొరికితే హాస్పిటల్‌కు, ఆయా వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు.
కొంతమంది దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, డాక్టర్లుగా చలామణి అవుతుండగా.. కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలుగా మిగిలిపోతున్నారు.
ఈ ఎగ్జామ్ కోసం లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నావాళ్లూ ఉన్నారు.
ఇకపై రెండేండ్లే టైమ్!
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నిసార్లైనా ఎఫ్‌ఎంజీఈ రాసుకునే వీలుంది.
కానీ, ఇకపై ఈ నిబంధనను మార్చే యోచనలో ఉన్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ప్రకటించింది.
ఎఫ్‌ఎంజీఈ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ తీసుకురాబోతున్నారు.
2023 నుంచి ఈ ఎగ్జామ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
నెక్స్ట్ స్టెప్ 1, నెక్ట్స్ స్టెప్ 2 పేరిట రెండు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.
ఈ ఎగ్జామ్స్‌ను విదేశాల్లో చదివిన వాళ్లతో పాటుగా, మన దేశంలో చదివిన స్టూడెంట్లు కూడా రాయాల్సి ఉంటుంది.
అయితే, విదేశాల్లో చదివిన స్టూడెంట్స్‌కు స్టెప్ 1 ఎగ్జామ్‌లో అడిషనల్ పేపర్స్ ఉంటాయని ఇటీవల ప్రకటించిన డ్రాఫ్ట్ రూల్స్‌లో పేర్కొంది.
అంతేకాదు, ఎఫ్‌ఎంజీఈ తరహాలో పాస్ అయ్యేవరకూ రాసుకునే అవకాశం ఉండదు.
కేవలం రెండు సంవత్సరాల్లో పాస్ కావాల్సి ఉంటుంది.
అంటే, ఐదేండ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాతి రెండేండ్లలో నెక్స్ట్ క్లియర్ చేయాలి.
అలా క్లియర్ చేయలేకపోతే, ఇక డాక్టర్ అయ్యే అవకాశం ఉండదు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్లేముందు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
ఇవి గమనించండి (MBBS in Abroad)
- మన దేశ వాతావరణంతో పోలి ఉండే దేశాన్ని ఎంచుకోవాలి.
- పేషెంట్లతో ఇంటరాక్ట్ కావడానికి లాంగ్వేజ్ చాలా ముఖ్యం.
- ఈ కోణంలో ఇంగ్లీష్ మాట్లాడే దేశాలైతే బెటర్.పరిమిత సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు ఉన్న కాలేజీని చూసుకోవాలి.
- కొన్ని కాలేజీలు వందల మందిని చేర్చుకుంటున్నయి.
- కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య చూడాలి.
- పేషెంట్లు లేకుంటే క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉండదు.కొన్ని దేశాల్లో క్లినికల్ ట్రైనింగ్ ఉండదు.
- అక్కడ చదివినవాళ్లు ఎఫ్‌ఎంజీఈ క్లియర్ చేయడం చాలా కష్టం.
- ఆయా దేశాలు, కాలేజీల్లో చదివిన స్టూడెంట్స్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
- అక్కడ చదివిన వాళ్లలో ఎంత మంది ఎఫ్‌ఎంజీఈ క్లియర్ చేశారో చూడాలి.
నెక్ట్స్ ఇంకా టఫ్ ఉంటది
తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ అనే స్లోగన్స్ చూసి పేరెంట్స్ తొందర పడొద్దు.
ఇప్పటికే నాసిరకం కాలేజీల్లో చదివొచ్చి, ఎఫ్‌ఎంజీఈ క్లియర్ చేయలేక వేల మంది ఇబ్బంది పడుతున్నారు.
కొత్తగా నెక్ట్స్ రాబోతుంది. ఎఫ్‌ఎంజీఈ కంటే నెక్ట్స్ ఇంకా టఫ్ ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే పిల్లల భవిష్యత్ ఎటూగాకుండా పోతుంది.
ఇవన్నీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడికైనా పంపాలనుకుంటే అక్కడ ఇదివరకే చదివొచ్చిన పిల్లల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
మెడికల్ కాలేజీల స్టాండర్డ్స్ ఎలా ఉండాలో ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంది.
ఆ స్టాండర్డ్స్‌తో విదేశాల్లోని కాలేజీ స్టాండర్డ్స్‌ను కంపేర్ చేసుకోవాలి.
ఆ తర్వాతే పిల్లల్ని పంపించే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ.
గత ఐదు ఎఫ్‌ఎంజీఈ వివరాలు:
ఇయర్ | పాసైన స్టూడెంట్ల సంఖ్య(శాతం) | ఫెయిలైన స్టూడెంట్ల సంఖ్య |
జూన్, 2021 | 4283(24.93) | 12,895 |
డిసెంబర్, 2020 | 3722(21.34) | 13,713 |
జూన్, 2020 | 1697(10.95) | 13,790 |
డిసెంబర్, 2019 | 4242(29.7) | 10,025 |
జూన్, 2019 | 2767(23.5) | 9,006 |
ఇవి కూడా చదవండి
డేటింగ్ యాప్స్ వాడకంలో హైదరాబాద్ టాప్.. సర్వేలో మరిన్ని..
ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..