MIM Asaduddin:
ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు MIM నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హెచ్చరించారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు.. అన్న అసద్ ఆపకపోతే పరిణామాలు మరోలా ఉండేవి.. సమయం, సందర్భం వచ్చినప్పుడు సత్తా చూపిస్తాం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ముందుగా.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. బీజేపీని మట్టికరిపిస్తాం.. తెలంగాణలో బీజేపీని మేమే ఓడిస్తాం అంటూ ఆయన పేర్కొంటే.. ఆ తర్వాత మైక్ అందుకున్న అక్బరుద్దీన్ ఏకంగా వార్నింగ్‌లే ఇచ్చారు. ఆవేశంగా ఊగిపోతూ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. సహనాన్ని, మౌనాన్నీ చేతగాని తనం అనుకుంటే సత్తా వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో రాజకీయాల గురించి, మతతత్వ పార్టీగా బీజేపీని చెబుతూ.. దాన్ని ఓడించే మార్గాల గురించి అసద్ మాట్లాడితే.. అక్బర్ మాటల్లో మాత్రం ఆవేశం కనిపించింది. అసద్ అపుతూ ఉండడం వల్లనే మౌనంగా ఉన్నామని, ఆ మౌనాన్ని చేతగాని తనం అనుకుంటే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు అక్బర్. అయితే, అంతకుముందు తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే, ఈ ఏడాది జరగనున్న కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీని తామే ఓడిస్తామని.. రాబోయే రాజస్థాన్, కర్నాటకల్లోనూ పోటీకి దిగుతున్నామని తెలిపారు. తెలంగాణలో గతంలోకంటే ఎక్కువ సీట్లలో MIM పోటీ చేస్తుందని అసదుద్దీన్ తెలిపారు. ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని అసద్ పిలుపునిచ్చారు.