రైతుబంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తీపికబురు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. మరికొంత మందికి పడకపోవడంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా కూసుమంచిలో మీడియాతో మాట్లాడారు.
రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతుబంధు అందుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకున్నారని… అందుకే కాంగ్రెస్‌ను ఆదరించారన్నారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించాల్సి ఉందన్నారు.
కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితమయ్యాయని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం బాగా కష్టపడుతున్నారని… ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నామని… పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. తనతో పాటు మంత్రి పొంగులేటి దృష్టిలో పాలేరు, ఖమ్మం ఒకటే అన్నారు. ఖమ్మం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.