పలు అంశాలపై చర్చించిన ఇరుదేశాధినేతలు
Modi and joe biden Decision on Strategic partnership : ఈ రంగాల్లో భారత్ – అమెరికా బంధం మరింత బలం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తొలిసారి ముఖాముఖీ భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. అనేక అంశాలను లేవనెత్తారు.
ముఖ్యంగా భారతీయుల అగ్రరాజ్య ప్రవేశానికి వారధిగా ఉన్న హెచ్-1బీ వీసాపై చర్చించారు.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ఆ దేశ సామాజిక భద్రతకు తోడ్పాటునందిస్తున్నారని గుర్తుచేశారు.
ఇరు నేతల సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ విషయాలను వెల్లడించారు.
దీనిపై వెంటనే స్పందించిన శ్వేతసౌధం.. 2021లో ఇప్పటి వరకు భారత విద్యార్థులకు 62 వేల వీసాలు జారీ చేసినట్లు గుర్తుచేసింది.
ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఉన్న రెండు లక్షల మంది భారత విద్యార్థులు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 7.7 బిలయన్ డాలర్లు సమకూరుస్తున్నారని తెలిపింది.
పటిష్ఠ రక్షణ భాగస్వామ్యం..
భారత్‌తో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కొనసాగిస్తామని బైడెన్ పునరుద్ఘాటించారు.
అమెరికాకు భారత్ చిరకాల రక్షణ భాగస్వామిగా అభివర్ణించారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
సమావేశం అనంతరం ఇరు దేశాల రక్షణ సంబంధాల పురోగతిపై శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలను అందులో ప్రస్తావించింది.
మానవరహిత విమానాల కోసం ఇరు దేశాల మధ్య జులైలో కుదిరిన 22 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
ఎఫ్/ఏ-18, ఎఫ్-15ఈఎక్స్, ఎఫ్-21 ఫైటర్ విమానాలు, ఎంక్యూ-9బీ మావనరహిత ఏరియల్ వ్యవస్థ, ఐఏడీడబ్ల్యూఎస్ క్షిపణి వ్యవస్థ, పీ-8ఐ మారిటైమ్ పెట్రోలింగ్ విమానం వంటి వ్యవస్థలను భారత్‌తో పంచుకుంటున్నట్లు వెల్లడించింది.
భారత్‌కు చెందిన సీ-130జే ప్రయాణ విమానానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు భారత్, అమెరికా వాయుసేన, లాక్‌హీడ్ మార్టిన్‌తో 329 మిలియన్ డాలర్లు విలువ చేసే ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.
అడ్డంకులు లేని వాణిజ్యం కోసం..
ఇరువురు నేతల మధ్య వాణిజ్య-ఆర్థిక సంబంధాల బలోపేతం పైనా చర్చలు జరిగినట్లు శ్రింగ్లా తెలిపారు.
ఆ దిశగా ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య శాఖల మంత్రులు కృషి చేసేలా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
వాణిజ్య-ఆర్థిక బంధాన్ని వీలైనంత త్వరగా కొత్తపుంతలు తొక్కే దిశగా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యాక్సిన్లను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా మేధోహక్కుల మినహాయింపులకు సహకరించినందుకు అమెరికాకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది.
ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.