HomeజాతీయంPM Kisan నిధులు రిలీజ్

PM Kisan నిధులు రిలీజ్

– జార్ఖండ్​లో విడుదల చేసిన ప్రధాని మోడీ
– ఆదివాసీల సంక్షేమం కోసం పీవీటీజీ ప్రారంభం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 15వ విడత నిధులను ప్రధాని మోడీ బుధవారం జార్ఖండ్‌లోని కుంతీలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా సుమారు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2 వేలు నగదు జమ అవుతుంది. అయితే, ఈ నిధుల విడుదలపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ (రెండో విడత), తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆలస్యం కావడంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్దేశపూర్వంగానే నిధుల విడుదలలో జాప్యం చేసిందని ఆరోపించారు.


జార్ఖండ్​లో పర్యటన..


జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ రూ. 24 వేల కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత (పీఎం పీవీటీజీ) పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అడవులు, పర్వతాల్లోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న 28 లక్షల మంది ఆదివాసీల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రోడ్డు, ఫోన్ కనెక్టివిటీ, పరిశుభ్రమైన తాగు నీరు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, స్థిరమైన జీవనోపాధిని వారికి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఖనిజ వనరులను వెలికితీసే క్రమంలో నిర్వాసితులైన ఆదివాసీల కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ప్రధాని మోడీని జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరేన్‌ కోరారు. అంతకుముందు ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఝార్ఖండ్‌లో ఆయన జన్మస్థలమైన ఉలిహటుకులో ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఉలిహుటుకును సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ప్రధానికి సంపద్రాయ నృత్యాలతో స్వాగతం పలికారు.

Recent

- Advertisment -spot_img