Rich people are reason for global Pollution : పర్యావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా..
అది 2018. సెఫాన్ గోస్లింగ్, ఆయన బృందంలోని సభ్యులు పారిస్ హిల్టన్, నుంచి ఓప్రా విన్‌ఫ్రే వరకు సంపన్నులైన కొందరు వ్యక్తుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించడంలో కొన్ని నెలలపాటు బిజీగా ఉన్నారు. గోస్లింగ్ స్వీడన్ లోని లినియస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్.
ఈ ప్రముఖులు విమానాలలో ఎన్నిసార్లు తిరిగారు అన్నది గోస్లింగ్, ఆయన బృందం తెలుసుకోవాలనుకుంది.
వాళ్లు అనేకసార్లు విమానాల్లో తిరిగినట్లు తేలింది. పర్యావరణ సమస్యల గురించి తరచూ మాట్లాడే బిల్ గేట్స్, 2017లో 59 సార్లు విమానంలో ప్రయాణించారు.
గోస్లింగ్ లెక్క ప్రకారం ఆయన 343,500 కి.మీ.ల దూరం విమానంలో ప్రయాణించారు.
ఇది ప్రపంచం మొత్తం చుట్టి వచ్చే దూరంకన్నా 8 రెట్లు ఎక్కువ.
ఈ ప్రయాణాల కారణంగా 1,600 టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు గాలిలోకి విడుదలయ్యాయి.
ఇది ఒక సంవత్సరంలో 105 మంది అమెరికన్లు సగటున విడుదల చేసే ఉద్గారాలతో సమానం.
ధనవంతుల కారణంగా ఏ స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలన్నది గోస్లింగ్ ప్రయత్నం.
పర్యావరణం విషయంలో వ్యక్తుల స్థాయిలో బాధ్యత తీసుకోవాలన్న పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఆలోచనలు గోస్లింగ్ పరిశోధనలకు మూలం.
విమానాలు ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేస్తాయి కాబట్టి, వాటిలో ప్రయాణించే వారు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన అంటారు.
”మీ కార్బన్ ఫుట్‌ప్రింట్ పెరుగుతున్న కొద్దీ, మీ నైతిక బాధ్యత మరింత పెరుగుతుంది” అని 2019లో ‘ది గార్డియన్’ న్యూస్‌కు రాసిన కథనంలో గ్రెటా థన్‌బర్గ్ పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాల విషయంలో అసమానతలు
ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు పెరుగుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది.
కరోనా మహమ్మారి రావడానికి ముందు వరకు 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన అసమానతలు కొనసాగాయి.
ఈ ఆర్ధిక సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రభావాలకు పేదలు ఎక్కువగా బాధితులవుతున్నారు.
ఈ అసమానతలను తగ్గించడం గురించిన చర్చలో, మనకు రావాల్సిన వాటా గురించి మర్చిపోతున్నామంటారు నిపుణులు.
‘‘మీరు ఒక యూనిట్‌ను మితిమీరి వాడుకుంటున్నారంటే.. మిగిలిన వారు దాన్ని కోల్పోతున్నట్లే” అని బెర్లిన్ కేంద్రంగా పని చేసే థింక్ ట్యాంక్ హాట్ అండ్ కూల్ మేనేజింగ్ డైరెక్టర్ లూయిస్ అకెంజీ అన్నారు.
అందువల్ల, కార్బన్ ఫుట్‌ప్రింట్‌లో అసమానతలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేస్తున్నప్రయత్నాలకు ముప్పుగా మారింది.
దీనికి సంబంధించిన డాటా కూడా షాక్ కలిగించేలా ఉంది.
ఆక్స్‌ఫామ్, స్టాక్‌హోమ్ ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ 2020లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2015లో ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో సగం ఉద్గారాలకు ప్రపంచంలోని 10% మంది ధనవంతులే కారణమని వెల్లడించింది.
ఇందులో 15% ఉద్గారాలకు ధనవంతులలో అగ్రశ్రేణికి చెందిన 1 శాతం మంది బాధ్యులు.
మిగిలిన 50% మంది పేదలల్లో అత్యంత పేదలు విడుదల చేసిన 7% ఉద్గారాల కన్నా 1% అగ్రశేణి ధనవంతులు విడుదల చేసిన ఉద్గారాలు రెండింతలు. కానీ, వాతావరణ మార్పుల దుష్పరిణామాలు పేదలపై కూడా ప్రభావం చూపుతాయి.
పేదల అవసరాలు తీరడం లేదు
ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూసేందుకు సంపన్నులు “కార్బన్ బడ్జెట్”లో ఎక్కువ భాగాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని స్టాక్‌హోమ్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిస్టిట్యూట్‌లోని స్టాఫ్ సైంటిస్ట్ ఎమిలీ ఘోష్ చెప్పారు.
‘‘జనాభాలో 50% మంది పేదలు తమ అవసరాలను తీర్చడానికి అవసరమైన కార్బన్ బడ్జెట్‌ను వినియోగించుకునే అవకాశం ఇవ్వడం లేదు”
హాట్ అండ్ కూల్ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయం ప్రకారం చాలా సంపన్న దేశాలకు చెందిన ప్రజలు అనుసరిస్తున్న విధానాలు పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.
దిగుమతి చేసుకున్న వస్తువుల నుండి వచ్చే ఉద్గారాల గురించి చెప్పాలంటే బ్రిటన్లో ఒక వ్యక్తి ప్రతి సంవత్సరానికి సగటున 8.5 టన్నుల కార్బన్‌ను విడుదల చేస్తారు.
కెనడాలో ఈ సంఖ్య 14.2 టన్నులు ఉంది. భూ ఉష్ణోగ్రతను 1.5 °C దాటకుండా చూసుకోవాలంటే ఈ ఉద్గారాలను 0.7 టన్నులకు తగ్గించాల్సి ఉంది.
ప్రజలు తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం ద్వారానే ఇలాంటి వాటిలో మార్పు వస్తుందని, లేదంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
“ఇది జీవనశైలిలో మార్పుకు సూచిక. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో చాలామంది అస్థిరమైన ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో జీవిస్తున్నారు.
కానీ, అత్యధిక ఉద్గారాలకు కారణమవుతున్న ధనికుల జీవనశైలి మార్పుల గురించి మాట్లాడకుండా, వారి ప్రభావాన్ని అడ్డుకోకుండా పర్యావరణ మార్పుల గురించి మాట్లాడలేం” అన్నారు అకెంజీ
“ధనవంతుల జీవన శైలి ఇతరులకు స్ఫూర్తిగా మారుతోంది. ఇది ప్రమాదకర ధోరణి” అని అమెరికాలోని క్లార్క్ యూనివర్సిటీకి చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ షెజ్వాల్డ్ బ్రౌన్ అన్నారు.
”విమానంలో ప్రయాణించడం ద్వారా మనం ఉన్నత వర్గాలకు చెందిన వారం అన్న భావన కలుగుతుంది”అన్నారో గోస్లింగ్.
”ప్రపంచంలోని 90 శాతానికి పైగా ప్రజలు ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. ప్రపంచ జనాభాలో 1 శాతం మంది, విమాన ప్రయాణాల వల్ల ఏర్పడే ఉద్గారాలకు కారణమవుతారు.
తమ సొంత పనుల కోసం, బ్రాండింగ్ కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే పారిశ్రామిక వేత్తలు,సెలబ్రిటీలు ప్రజల్లో కొత్త ఆకాంక్షలను సృష్టిస్తున్నారు” అన్నారు గోస్లింగ్
ధనవంతులు-పెద్ద కార్లు
దేశాధినేతలు, బడా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఉపయోగించే ఎస్‌యూవీ కార్లు కాలుష్య కారకాలైనప్పటికీ అలాంటి వాటిని కొనాలని మధ్యతరగతి ప్రజలు కలలుకంటుంటారు.
2019లో ప్రపంచవ్యాప్తంగా వాహనాల విక్రయాలు 42% పెరిగాయి. ఉద్గారాలు అధికంగా పెరిగిన ఏకైక రంగం ఎస్‌యూవీ వాహన రంగమే.
పెద్దసంఖ్యలో ఎస్‌యూవీల కొనుగోళ్లు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరగడం వల్ల కలిగే ప్రయోజనాలను దెబ్బతీశాయి.
వినియోగం ఎక్కువగా ఉన్నందున పెద్ద ఇళ్ల వల్ల కూడా ఈ సమస్య పెరుగుతోంది.
పర్యావరణానికి ధనికులు ఎంత వరకు కారణం అన్న అంశంపై ఇటీవలి విడుదలైన ఓ రిపోర్ట్‌కు సహ రచయితగా పని చేసిన కింబర్లీ నికోలస్ అభిప్రాయం ప్రకారం “ఇల్లు ఒక సోషల్ స్టేటస్‌గా మారింది” గృహ ఉద్గారాలలో 11% ధనికుల గృహాల నుండి వస్తాయి.
అయితే, గత కొన్నేళ్లుగా మార్పులు కూడా వచ్చాయి. థన్‌బెర్గ్ ప్రయత్నాల నుండి ప్రేరణ పొంది స్వీడన్‌లో ఫ్లాగ్‌స్కీమ్ (ఈ స్వీడిష్ పదానికి అర్దం ట్రావెల్ షేమ్) అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది.
ఇది ఒక మనిషి ఎంత విమాన ప్రయాణం చేయవచ్చో చెబుతుంది.
ఈ ఉద్యమం కారణంగా, స్వీడన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య 2018లో 4శాతం తగ్గింది. ఇది చిన్న విషయం కాదు.
మీటింగ్‌ల స్థానాన్ని వీడియో కాల్స్ భర్తీ చేయగలవని కోవిడ్ 19 ప్రపంచానికి నేర్పింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 84 శాతం కంపెనీలు ఇప్పుడు పని సంబంధిత ప్రయాణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రజలు తమ ఆహారంపై కూడా శ్రద్ధ చూపడం ప్రారంభించారు, దీని కారణంగా కూరగాయలతో తయారు చేసిన మాంసానికి మార్కెట్ పెరిగింది.
“ఈ మార్పు ఏ ప్రభుత్వ విధానం వల్లో వచ్చింది కాదు” అని సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ నావల్ చెప్పారు. కాకపోతే ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి.
“జంతువులు అంతరించిపోవడం ప్రారంభించిన తర్వాత మనం వాతావరణ మార్పుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం.
సమస్యకు పరిష్కారం వేగవంతంగా జరగాలి. దీని కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి” అని కార్బన్ ఇనీక్వాలిటీ: ద రోల్ ఆఫ్ ఆఫ్ ది రిచ్చెస్ట్ అనే పుస్తకం రచయిత కెన్నర్ అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు, విమాన ప్రయాణాలకు ఎక్కువ పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం ఆ డబ్బును మెరుగైన ప్రజా రవాణా కోసం ఉపయోగించుకోవచ్చు.
పెద్ద ఇళ్ల నుండి వసూలు చేసిన పన్నులు అలాంటి గృహాలను అడ్డుకోవడానికి, ఇంధన లేమికి పరిష్కారంగా ఉపయోగించవచ్చు.
కానీ సమస్య ఏమిటంటే, ధనవంతులు ఎంత డబ్బు కట్టడానికైనా సిద్ధంగా ఉంటారు.
తాము చేయాలనుకున్నవి చేస్తూనే ఉంటారు. అప్పుడు సమస్య కొనసాగుతూనే ఉంటుంది.
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
ఉద్గారాలను నియంత్రించడానికి ‘కార్బన్ అలవెన్స్’ ఇవ్వడమనేది ఒక మార్గం.
ఈ కార్బన్ అలవెన్స్‌ను ఒక వ్యక్తి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు.
ఎక్కువ కార్బన్‌లు విడుదల చేయాలనుకుంటే, తన దగ్గర లేనప్పుడు ఇతరుల నుంచి ఆ వ్యక్తి కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఈ పద్ధతిని ఐర్లాండ్, ఫ్రాన్స్, కాలిఫోర్నియాలలో ఉపయోగిస్తున్నారు.
అయితే, ఇది ఆర్థికంగా అంత ప్రభావ వంతంగా ఉండదని, సామాజికంగా కూడా ఆమోదానికి నోచుకోదని యూకే ప్రభుత్వం రూపొందించిన ఒక ఎనాలిసిస్ వెల్లడించింది.
ప్రైవేట్ జెట్‌లు, పెద్ద పెద్ద ఓడలు మార్కెట్‌లోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రభుత్వానికి మార్గం ఉంది.
అయితే, దానికి బదులుగా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే మార్గాల దృష్టి పెట్టాలి.
వాతావరణ మార్పుల ప్రభావాలపై చర్యలు తీసుకుంటే తమ ఓటర్లకు కోపం వస్తుందని, ధనికులు కూడా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
దేశాలు తీసుకుంటున్న చర్యలు
యూకేలో ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడానికి వేల్స్ ప్రభుత్వం కొత్త హైవే ప్రాజెక్టులను నిలిపివేసింది.
నెదర్లాండ్స్ ప్రభుత్వం పశు పోషణను ముప్పై శాతం తగ్గించింది. యూకే నగరాలైన నార్విచ్, ఎక్సెటర్‌లలో తక్కువ ఉద్గారాలు విడుదల చేసే గృహాలకు ప్రాధాన్యం పెరిగింది.
2021 సంవత్సరంలో ఆమ్‌స్టర్‌డామ్ ఎస్‌యూవీలు, తక్కువ దూరపు విమానాలకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధించింది.
బ్రెజిల్‌లోని సావోపాలో, ఇండియాలో చెన్నై వంటి నగరాలు కూడా బిల్‌బోర్డ్‌లపై ఇటువంటి ప్రకటనలను నిషేధించాయి.
పెద్ద మార్పులు అవసరం
అయితే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవని అకెంజీ అంటున్నారు.
వాతావరణ మార్పుల వేగంగా జరుగుతున్నందున, ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి.
అంటే సుస్థిర అభివృద్ధి, మెరుగైన ప్రజా రవాణా, విద్యుత్ కోసం బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించాలి.
మెరుగైన గృహాలు, ఇంధనంతో నడిచే వాహనాలను తొలగించడం గురించి చర్చించాలి.
“ఎవరూ ఉద్దేశపూర్వకంగా పర్యావరణానికి హాని చేయరు. ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి, మెరుగైన జీవితం కోసం లేదంటే ఆకర్షించే ప్రకటనలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా కాలుష్య కారక ఉత్పత్తులను ఉపయోగిస్తారు” అన్నారు అకెంజీ.
వ్యక్తిగతంగా తీసుకున్న చర్యలు పెద్దగా సహాయపడవని, అవి సరిగ్గా పని చేయలేదని బాధపడటం తప్ప ఏమీ మిగలదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
“మనమందరం ఒక కార్యకర్తలా పని చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వాల వెంట పడాలి” అన్నారు అకెంజీ