యాసంగి కాలం రైతుబంధు డబ్బుల జమ ఇవాళ్టి నుంచి వేగవంతం అవ్వనుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది.
ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కొందరికీ మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న సందేహంలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాసంగి కాలంలో రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలని, రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
మరికొంత మంది రైతులు ఒక్క ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కొంతమందికే డబ్బులు జమ చేశారు. మరి రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఏ విధంగా జమచేస్తారో అన్న సందేహంలో ఉన్నారు. వీలైనంత త్వరగా రైతుబంధు డబ్బులు జమ చేసి తమను ఆదుకోవాలని రైతులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.