ఇదేనిజం, కంది : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం కేంద్రంలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, సీఐటియు నారాయణఖేడ్ డివిజన్ నాయకులు సతీష్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల ఇతర సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ డివిజన్ వ్యాప్తంగా గత 6 నెలల నుంచి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. పంచాయతీ కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్క్ విధానం రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనె, షాంపు బెల్లం, ఇతర వస్తువులు వెంటనే ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ తదితర సమస్యల్ని పరిష్కరించాలని కోరారు, పంచాయతీ కార్మికులను జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగారాం, సంగ్రామ్, యేశప్ప, శంకర్, శంకర్, షిద్దిరాం, రాజు, తదితరులు పాల్గొన్నారు.