బీసీ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పిచ్చకుంట్ల అని పదం ఎవరైనా వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, ఇతర కులస్తులు గాని ఎవరైనా పిచ్చకుంట్ల వాడితే కేసులు పెడతాం అని తెలిపారు. పిచ్చకుంట్ల అనే పేరు పిలవడం మానేసి వంశరాజ్ పేరును మాత్రమే పిలవాలని బీసీ కమిషన్కు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయడంలో భాగంగా బి.సి. కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయ ప్రకాష్, తిరుమల గిరి సురేందర్, బాలలక్ష్మి బహిరంగ విచారణ చేపట్టారు.