Small Kingdom : ఆ రాజ్యంలో జనాభా 11 మందే.. మరి రోజూ రాజు ఏం చేస్తాడు..
Small Kingdom : ఆ రాజ్యంలో జనాభా 11 మందే.. మరి రోజూ రాజు ఏం చేస్తాడు.. రాజ్యం అంటే వందలాది ఊళ్లు.. వేలాది మంది సిబ్బంది.. లక్షలాది మంది ప్రజలతో చాలా పెద్దగా ఉంటుంది.
కానీ ఒక చివర నుంచి మరో చివరకు కేవలం నిమిషాల్లోనే వెళ్లగలిగేంత ఉన్న ఒక చిన్న సామ్రాజ్యం గురించి తెలుసా ! అక్కడి జనాభా కూడా 11 మందే ! అంతేకాదు ఈ రాజ్యానికి ఉన్న రాజు కూడా చాలా వింతగా ఉంటాడు.
నిక్కర్ వేసుకుని పడవ నడుపుతూ బతికేస్తుంటాడు. ఇదే కాదు.. ఈ రాజ్యం ఏర్పడటం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందామా..
ఈ రాజ్యం ఎక్కడ ఉంది?
ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో మధ్యధరా సముద్రంలో ఓ దీవి ఉంది.
దాని పేరే టవోలారా. ఈ దీవి ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ సామ్రాజ్యంలో కేవలం 11 మంది మాత్రమే ఉంటారు. ఈ రాజ్యానికి ఒక చక్రవర్తి కూడా ఉన్నాడు.
ఆయన పేరు ఆంటోనియో బర్దలివోని.
ఒక దేశానికి రాజు అంటే శిరస్సుపై కిరీటంతో ప్రత్యేకమైన దుస్తులు ధరించి.. చుట్టూ పనివాళ్లతో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటాడేమో అనుకుంటే పొరపాటే.
ఒకవేళ మీరు ఈ రాజ్యానికి వెళ్తే.. రాజును గుర్తించడం చాలా కష్టం.
ఎందుకంటే.. ఇక్కడి రాజు నిక్కర్ వేసుకుని తిరుగుతుంటాడు.
ఈ రాజ్యంలో రాజుకు కేవలం భోజనం మాత్రమే ఉచితంగా లభిస్తుంది.
మిగతా అవసరాల కోసం కష్టపడాల్సిందే. అందుకే ఈయన పడవ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.
ఈయనకు ఈ రాజ్యంలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. రాజ్యం ఏర్పడి 180 సంవత్సరాలు అవుతుంది.
ఈ సామ్రాజ్యం ఇటీవలే 180వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జరుపుకుంది.
ఈ రాజ్యం ఎలా ఏర్పడింది
టవోలారా రాజ్యం ఏర్పడటం వెనుక పెద్ద కథే ఉంది.
ఇటలీ దేశంగా అవతరించకముందు సార్డీనియా రాజ్యంలో ఉండేది.
అక్కడ రెండు పెండ్లిళ్లు చేసుకోవడం నేరం.
కానీ టవోలారా ప్రస్తుత రాజు ఆంటోనియా ముత్తాతకు ముత్తాత గుసెప్పే రెండు పెండ్లిళ్లు చేసుకున్నాడు.
దీంతో శిక్ష తప్పించుకునేందుకు గుసెప్పే తన ఫ్యామిలీతో 1807లో సార్డీనియా నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చాడు.
ఆ తర్వాత కొంతకాలానికి టవోలారా దీవి గురించి సార్డీనియా రాజు చార్లో ఆల్బెర్టోకు తెలిసింది.
ఈ దీవిలో బంగారు వర్ణంలో పళ్లు ఉండే మేకలు ఉంటాయని.. ప్రపంచంలో ఇలాంటి మేకలు ఇక్కడ మాత్రమే ఉంటాయని ప్రజలు చెప్పుకునేవాళ్లు.
దీంతో ఈ మేకలను చూసేందుకు 1836లో సార్డీనియా రాజు ఈ దీవికి వచ్చాడు.
అక్కడికి రాగానే ఆల్బెర్టోకు గుసెప్పే కుమారుడు పవోలో కనిపించాడు.
దీంతో తాను సార్డీనియా రాజునని ఆల్బెర్టో పరిచయం చేసుకున్నాడు.
అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని పవోలో.. తాను టవోలారా రాజ్యానికి రాజునని బదులిచ్చాడు.
ఆ పరిచయం తర్వాత మూడు రోజుల పాటు ఆల్బెర్టో.. అక్కడే ఉండి బంగారు వర్ణపు పళ్లు ఉన్న మేకలను వేటాడాడు.
అందుకు పవోలో సాయం చేశాడు.
మూడు రోజుల తర్వాత సార్డీనియాకు వెళ్లిన ఆల్బెర్టో.. టవోలారా తమ రాజ్యంలో భాగం కాదని ప్రకటించాడు.
ఇక అప్పుడు పవోలో తన సామ్రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. అప్పట్లో ఆ రాజ్యంలో 33 మంది ఉండేవారు.
నాటో రాకతో అధికారం పోయింది (Small Kingdom)
సార్డీనియా రాజు పర్యటనతో టవోలారా సామ్రాజ్యం గురించి మధ్యధరా సముద్రంలో చాలా దేశాలకు తెలిసిపోయింది.
19వ శతాబ్దంలో ప్రపంచ దేశాల చక్రవర్తుల ఫొటోలను సేకరించాలని క్వీన్ విక్టోరియా ఆదేశించారు.
ఆ సమయంలో టవోలారా రాజ కుటుంబం ఫొటోలను కూడా బ్రిటన్ తీసుకెళ్లారు.
ఆ ఫొటోలు ఇప్పటికీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కనిపిస్తాయి.
అయితే 1962లో నాటో టవోలారాను స్థావరంగా మార్చుకోవడంతో.. పవోలో వారసులు ఈ రాజ్యంపై ఉన్న అధికారాలను కోల్పోయారు.
కానీ ఆ కుటుంబం వారిని రాజుగానే గుర్తిస్తారు.
ఇక్కడ విశేషమేంటంటే.. టవోలారాను తమ దేశంలో భాగమని ఇటలీ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.
అలాగే టవోలారాను ప్రత్యేక దేశంగా ఎవరూ గుర్తించలేదు.
పడవ నడపడమే రాజుగారి జీవనాధారం (Small Kingdom)
టవోలారా రాజ్యానికి చుట్టుపక్కల చాలా రకాల సముద్ర జీవులు ఉంటాయి.
ఈ రాజ్యంలో అరుదైన మేకలు, గద్దలు ఉంటాయి.
వీటిని చూసేందుకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు.
వారికోసం ఆంటోనియా, అతని మేనల్లుడు పడవ నడుపుతుంటారు.
మరో మేనల్లుడు రెస్టారెంట్ నడుపుతుంటాడు. అక్కడే చేపలు పట్టి పర్యాటకులకు ఆహారం సిద్ధం చేస్తుంటాడు.
ప్రస్తుతం ఇదే ఈ రాజుగారి జీవనాధారం. ఈ రాజుగారికి ఒక దినచర్య కూడా ఉంది.
పొద్దున్నే లేవగానే తమ కుటుంబానికి చెందిన శ్మశాన వాటికకు వెళ్తాడు.
అక్కడ తన భార్య సమాధిపై ప్లాస్టిక్ పూలు పెట్టి నివాళులర్పించిన తర్వాతే ఏ పని అయినా మొదలుపెడతాడు.
సమాధిపై ప్లాస్టిక్ పూలే పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది.
సమాధిపై పెట్టిన పూలను ఇక్కడి అరుదైన మేకలు తినేస్తున్నాయంట.
అందుకే మేకలు తినకుండా ఉండేందుకు రాజుగారు ప్లాస్టిక్ పూలను పెడుతున్నారు.