Homeఎడిటోరియల్​Step wells : ‘పాతాళ ద్వారాలు’ భారతదేశ మెట్ల బావులు..

Step wells : ‘పాతాళ ద్వారాలు’ భారతదేశ మెట్ల బావులు..

Step wells in India solution for drinking water : ‘పాతాళ ద్వారాలు’ భారతదేశ మెట్ల బావులు..

ఎత్తయిన కోటలను తిరగేసి భూమిలో లోతుగా నిర్మించినట్లు కనిపించే భారీ నిర్మాణాలు భారతదేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. వీటినే మెట్లబావులు (Step wells) అని అంటారు.

ఇప్పుడు వాటిలో చాలా వరకు ఎండిపోయి, పాడుబడిపోయినా వాటిని బాగు చేస్తే దేశం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు అంటున్నారు.

రాజస్థాన్‌లో 8-9 శతాబ్దాల మధ్య కాలంలో పాలించిన రాజపుత్ర పాలకుడు రాజా చందా నిర్మించిన ఈ మెట్లబావి 3,500 మెట్లతో అద్భుతంగా చెక్కిన శిల్పంలా ఉంటుంది.

కచ్చితమైన కొలతలతో, ఆధునిక ఇంజినీరింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ బావిని నిర్మించారు.

దీనికి మూడు వైపులా మెట్లు ఉంటాయి. నాలుగో వైపు అందంగా అలంకరించిన బాల్కనీలు ఉంటాయి.

రాజస్థాన్‌లోని అభానేరిలో ఉన్న ఈ చాంద్ బావ్రీ (బావ్రీ, బావోలి అంటే బావి) దేశంలోనే అత్యంత లోతైన మెట్ల బావిగా పేరు తెచ్చుకుంది. సుమారు 100 అడుగుల లోతు ఉంటుంది.

చాంద్ బావ్రీ వంటి మెట్ల బావులు భారతదేశంలోని కరువు పీడిత ప్రాంతాలలో ఏడాది పొడవునా నీటిని అందించే ఉద్దేశంతో నిర్మించారు.

అయితే, శతాబ్దాలు గడవడంతో ఇవి చెడిపోవడం సహజమే.

కానీ, సంరక్షణ గురించి పట్టించుకోక పోవడంతో వీటిలో చాలా బావులు పాడుబడిన స్థితిలో ఉన్నాయి. కొన్ని కనుమరుగయ్యాయి.

ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో ఒకప్పుడు తీవ్రమైన నీటి సమస్యను పరిష్కరించడంలో సహాయపడిన ఈ పురాతన కట్టడాలను తిరిగి అదే లక్ష్యంతో పునరుద్ధరిస్తున్నారు.

ఇటీవలి ప్రభుత్వ నివేదిక ప్రకారం, చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభం దేశంలో నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మెట్లబావుల పురాతన సాంకేతికత ఒక పరిష్కారాన్ని అందించగలదన్న భావన వ్యక్తమవుతోంది.

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా భూగర్భ జలాలను వాడుకునేది భారతదేశమే.

దేశంలో నీటి కొరత ప్రమాదం

2007-2017 మధ్య భారతదేశంలో భూగర్భ జలాల స్థాయి 61% క్షీణించిందని అంచనా.

ఈ కీలక వనరు తగ్గిపోవడం వల్ల ప్రజల తాగునీటికి మాత్రమే కాకుండా ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

నీటి కొరత వల్ల 68 % వరకు ఆహార పంటలు తగ్గుతాయని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత దేశంలో సగటు వర్షపాతం 40 కోట్ల హెక్టార్ మీటర్లు ఉంటుంది.

అయితే కాలుష్యం కారణంగా దాదాపు 70% వర్షపు నీరు మానవ వినియోగానికి పనికి రాదు.

నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. నీటి ఎద్దడి కారణంగా ప్రతి సంవత్సరం 2 లక్షలమంది మరణిస్తున్నారు.

ఈ సమస్యలు భారతదేశం చారిత్రక నీటి నిర్వహణ వ్యవస్థలను తిరిగి ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి.

స్థానిక అవసరాల కోసం సంప్రదాయ నీటి వ్యవస్థలను ఆధునీకరించడానికి రాష్ట్రాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు.

60 కోట్ల మంది అంటే దాదాపు సగం జనాభా ప్రతిరోజూ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశంలో, సాంప్రదాయ జల సంరక్షణ విధానాలు నేటికీ ఆశాజనకంగా ఉన్నాయి.

“భారతదేశంలో నీటి మట్టం వేగంగా క్షీణించడంతో, మెట్ల బావుల్లాంటి జలాశయాలను తిరిగి నింపడానికి తోడ్పడతాయి.

వర్షాకాలంలో మూడు నెలల్లో, మిలియన్ల లీటర్ల నీటిని సేకరించవచ్చు” అని అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌ లో ప్రాజెక్ట్ డైరక్టర్, కన్సర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌ రతీశ్ నందా చెప్పారు.

ఈ ట్రస్ట్ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఒకటైన రాజస్థాన్‌లో చాంద్ బావ్రీతో సహా అనేక మెట్లబావులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహాయంతో 2018లో సమగ్ర ప్రణాళికను రూపొందించింది.

“రాజస్థాన్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్’ ద్వారా చెడిపోయిన వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను పునరుద్ధరిస్తుంది.

తద్వారా గ్రామాలను జల స్వయం సమృద్ధంగా మార్చడానికి చర్యలు తీసుకుంది” అని జిందాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో అధ్యాపకుడు మోహిత్ ధింగ్రా చెప్పారు.

“సంప్రదాయ నీటి వనరులు చాలా నిర్వీర్యం అయ్యాయి. మెట్ల బావులను పునరుద్ధరించడం వలన ప్రజలు నీటి సమస్య తీరుతుంది.

చాంద్ బావ్రీ వంటి భారీ నిల్వ సామర్ధ్యం ఉన్న మెట్ల బావుల కారణంగా నీటి కొరతను తగ్గించవచ్చు”అని ఆయన అన్నారు

జీవనోపాధి కోసం పశువులను పోషించే బన్సీ దేవి ఇప్పటికే ఒక మార్పును గమనించారు.

“మేము ఇంతకు ముందు నీటి కోసం గంటల తరబడి వెతకాల్సి వచ్చేది. మా గ్రామంలోని బాగు చేసిన పాత మెట్లబావి నుంచి ఇప్పుడు ఇంటికి, పశువులకు సరిపడా నీళ్లు దొరుకుతున్నాయి” అన్నారామె.

జోధ్‌పూర్ నగరంలో తూర్జి అనే ఓ పాడుబడ్డ మెట్ల బావిలో మురుగు నీటిని తోడటానికి ఒక బృందానికి కొన్ని నెలల సమయం పట్టింది.

దశాబ్దాలుగా విషపూరితమైన ఇందులోని నీరు ఎరుపు రంగురాళ్లను తెల్లగా మార్చింది.

గోడల మీద పేరుకుపోయిన క్రస్ట్‌ను తొలగించడానికి దాదాపు రూ.15 లక్షలు ఖర్చయింది.

నీటి పారుదల, గృహావసరాల కోసం ఈ బావిని శుభ్రం చేసిన తర్వాత దీని నుంచి రోజుకు దాదాపు 2.8 కోట్ల లీటర్ల నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గ్రామ భారతి సమితి (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) వివిధ గ్రామాలలోని ఏడు మెట్ల బావుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. దీని కారణంగా దాదాపు 25,000 మందికి నీరు అందుతోంది.

” భూగర్భ జలాలను రీఛార్జ్ చేశాం. నిల్వ సామర్థ్యం పెరిగింది” అని గ్రామ భారతి సమితి కార్యదర్శి కుసుమ్ జైన్ అన్నారు.

“చాలా మెట్లబావులు గ్రామస్తుల రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని అందించగలవు” అన్నారామె.

రాజస్థాన్‌లోని శివపురాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజ్‌కుమార్ శర్మ ఈ పునరుద్ధరణ చర్యలపట్ల హర్షం వ్యక్తం చేశారు.

“ఈ బావులు మా సాంస్కృతిక జీవితంలో అంతర్భాగం. మా గ్రామంలో మెట్లబావి ఒక్కటే నీటి ఆధారం.

కాలక్రమేణా అది ఎండిపోయి చెత్త కుప్పగా మారిపోయింది.

ఇప్పుడు తాగడానికి, గృహ అవసరాలకు, మతపరమైన వేడుకలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంది. ఈ బావి మా ఊరికే గర్వకారణం” అన్నారాయన.

పురాతనం కాలం నుంచీ…

క్రీస్తు పూర్వం 2500-1700 కాలంలో సింధు లోయ నాగరికతలో కూడా ఈ తరహా మెట్ల బావులున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

అయితే, మొదట్లో మామూలు బావులు నిర్మించినా, 11-15వ శతాబ్దం మధ్య కాలంలో ఇంజనీరింగ్ అద్భుతాలుగా పరిణామం చెందాయి.

2016లో ‘స్టెప్‌వెల్ అట్లాస్’ భారతదేశంలోని దాదాపు 3,000 మెట్లబావులను గుర్తించి రికార్డు చేసింది. దేశ రాజధాని దిల్లీలోనే 32 మెట్ల బావులు ఉన్నాయి.

మెట్లబావులు కేవలం నీరు తోడుకునే అవకాశానికే కాకుండా అందం, అలంకారం కూడా జోడించి ఉంటాయి.

బహుళ అంతస్తుల భవనాల లాగా ఇవి బహుళ అంతస్తుల భూగర్భ నిర్మాణాలు.

“మెట్లబావులు భారతదేశ చారిత్రక కథల భాండాగారాలు. కమ్యూనిటీ మీటింగ్‌లు, మతపరమైన వేడుకలకు ఇవి నిలయాలు” అని చరిత్రకారుడు రాణా సఫ్వీ అన్నారు.

“లోపలి భాగంలో ఉష్ణోగ్రతలు బయటకంటే ఐదారు డిగ్రీలు తక్కువగా ఉంటాయి. దీంతో అవి ప్రయాణికులకు కూల్ రిట్రీట్‌లుగా పని చేశాయి.

నీటి కొరతను అధిగమించే పోరాటంలో మెట్లబావుల పునరుద్ధరణ కీలకమైన దశ” అన్నారు రాణా.

షికాగోకు చెందిన రచయిత్రి విక్టోరియా లౌట్‌మాన్ తన పుస్తకం ‘ది వానిషింగ్ స్టెప్‌వెల్స్ ఆఫ్ ఇండియా’లో వీటిని పాతాళానికి ద్వారాలుగా అభివర్ణించారు.

“ఇటీవల భారతదేశపు మెట్ల బావుల గురించి అవగాహన పెరిగింది.

దాదాపు 1,500 సంవత్సరాలుగా నీటిని అందించడంలో మెట్లబావులు ఎంత అద్భుతంగా, సమర్ధవంతంగా పని చేశాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం.

వీటి పునరుద్ధరణ ప్రయత్నాలకు ధన్యవాదాలు” అన్నారామె.

వరద నీటిని సేకరించడానికి వాలుల వెంట ఈ మెట్లబావులను నిర్మించారు.

పాతకాలపు పనిముట్లతో ఇంత లోతైన భూగర్భ బావులను తవ్వడం చాలా శ్రమతో కూడుకున్న పని అని లౌట్‌మాన్ అన్నారు.

“రాళ్లు, కంకర, ఇసుక, ఇటుకలను ఉపయోగించి నిర్మించారు.

మెట్లబావులలో పొడవైన మెట్లు, కందకం చుట్టూ సైడ్ లెడ్జ్‌లను నైపుణ్యంంతో ఏర్పాటు చేశారు.

ఇవి నీటిని సేకరించడానికి ఉపయోగపడతాయి” అని ఆమె వివరించారు.

వ్యవసాయానికి ఉపయోగించే మెట్ల బావులకు పొలాలలోకి నీటిని పంపే డ్రైనేజీ వ్యవస్థలు కూడా జత అయి ఉన్నాయి.

మెట్ల బావులలో ఉపయోగించిన సాంకేతికతను పరిశీలించినప్పుడు, అవసరం, అందం ప్రాతిపదికగా ఇవి నిర్మితమైనట్లు గుర్తించారు.

మంచి రోజులు వస్తాయా?

2017లో దిల్లీలో 15 మెట్ల బావులను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

దిల్లీలోని హుమాయున్ సమాధి కాంప్లెక్స్‌లో మెట్ల బావిని పునరుద్ధరించడానికి 2019లో అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ భారతదేశంలోని జర్మన్ ఎంబసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

14వ శతాబ్దానికి చెందిన హజ్రత్ నిజాముద్దీన్ దర్గా దగ్గర ఉన్న మెట్లబావిని ముందుగా పునరుద్ధరించారు.

ఇక్కడున్న బావి చాలా వరకు కూలి పోయింది. దీనివల్ల స్థానికులకు ప్రమాదం ఉండటంతో వారిని వేరే ప్రాంతాలకు తరలించారు.

“కూలిన భాగాన్ని సంప్రదాయ వస్తువులతో పునర్నిర్మించడం, 700 ఏళ్లుగా పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగించడం, శుభ్రపరచడం, దిగువన 80 అడుగుల పూడికను తీయడంలాంటి పనులు నిర్వహించాం.

ఇప్పుడు దీనిని నీటితో రీఛార్జ్ చేయగలుగుతున్నాం” అని నందా చెప్పారు.

“దర్గా మెట్ల బావిని ప్రత్యేకమైనదిగా, పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు.

తాగడానికి, వైద్యం కోసం నీటిని తీసుకువెళుతుంటారు.

స్థానికులు ఈ బావిలో పరిశుభ్రమైన నీటిని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు” అని దిల్లీ వాసి కలీముల్ హఫీజ్ అన్నారు.

”కానీ, మెట్ల బావులు కేవలం నీటి వనరు మాత్రమే కాదు. అవి భారతదేశ నిర్మాణ చరిత్రలో భాగం.

వారసత్వ ప్రదేశాలు కూడా. ఇప్పుడు వీటి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం పేరుకు పోయాయి.

వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది” అని నందా అన్నారు.

” మెట్లబావులను పునరుద్ధరించడం వల్ల దేశపు నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు.

కానీ, నీటి కొరత మీద పోరాడటానికి స్థానిక స్థాయిలో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది” అన్నారు నందా.

Recent

- Advertisment -spot_img