TDP Meeting : టీడీపీ మాలల ఆత్మగౌరవ సభలో ఆత్మహత్యాయత్నం
TDP Meeting : విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిన్న నిర్వహించిన టీడీపీ మాలల ఆత్మగౌరవ సభలో కలకలం రేగింది.
ఐఆర్ఎస్ మాజీ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ ఆధ్వర్యంలో సభ జరుగుతుండగా పామర్రుకు చెందిన దళిత యువకుడు జోజి వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
పక్కనున్న వారు అడ్డుకుని ఆయనను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అనంతరం దేవీప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
వేల కోట్ల రూపాయలను నవరత్నాలకు వినియోగిస్తున్నారని విమర్శించారు. నిధులు లేని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఎందుకని ప్రశ్నించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మాలలకు ఇవ్వాలని కోరారు. అలాగే, ఎస్సీ సెల్‌లో మాదిగలకు, మాలలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
టీడీపీలోని మాల నాయకులు మాలల సమస్యలపై స్పందించడం లేదని దేవీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహానాడులో కొందరు మాదిగ నాయకులు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు చెప్పారు.