Teacher sexual harassment : కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినప్పటికీ క్లాసుల పేరుతో బాలికలను పాఠశాలకు రప్పించి అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కోర్టు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్‌కుమార్ (40) సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
కరోనా నేపథ్యంలో గతేడాది పాఠశాలలు మూతపడినప్పటికీ సునీల్ కుమార్ మాత్రం కొందరు బాలికలను పాఠాల పేరుతో స్కూలుకు రప్పించేవాడు.
ఈ క్రమంలో అతడు విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.
గతేడాది డిసెంబరు 5న తల్లిదండ్రుల సాయంతో ఐదుగురు బాలికలు సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాతి రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజాగా నిన్న ఈ కేసును విచారించిన కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించారు.
21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.