– బీజేపీలో గందరగోళం
– వేములవాడలో కంటతడి పెట్టుకున్న తుల ఉమ
– సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ఎదుట దేశ్‌పాండే నిరసన
– కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
ఇదేనిజం, సంగారెడ్డి : తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ అధిష్ఠానాలు టికెట్లు ఒకరికి కేటాయించి, బీ ఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. బీజేపీ శుక్రవారం విడుదల చేసిన చివరి జాబితాలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ నేత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేకు కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకుండా పులుమామిడి రాజుకు ఇచ్చింది. దీంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. శుక్రవారమే నామినేషన్ల ఘట్టం ముగియడంతో సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ఎదుటే రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నిరసనకు దిగారు.
వేములవాడలోనూ…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. బీజేపీ అధిష్ఠానం వేములవాడ టికెట్‌ను తుల ఉమకు కేటాయించింది. కానీ బీఫామ్ మాత్రం చెన్నమనేని వికాస్‌రావు కేటాయించింది. దీంతో ఉమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వికాస్‌రావుకు బీ ఫామ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను ముందు నుంచి గడీల పాలనపై కొట్లాడనని, ఇప్పుడు కొట్లాడతానన్నారు.