ఇదే నిజం, నర్సంపేట: విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకున్న వేళ నోటు పుస్తకాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఒకవైపు విద్యార్థులు పుస్తకాల మోతతో తల్లడిల్లుతుండగా, ఇప్పుడు పెరి గిన పుస్తకాల ధరల భారాన్ని తల్లిదండ్రులు మోయలేకపోతున్నారు. చిన్నసైజు నోట్ పుస్తకం నుంచి లాంగ్ నోట్స్ వరకు ప్రతి పుస్తకానికి రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో నోట్ పుస్తకాల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. తరగతుల వారీగా. ఇంగ్లీష్ మీడియం నర్సరీ విద్యార్థుల నోట్ బుక్స్ ఒక్క సెట్ కోసం రూ.500, ఎల్కేజీకి రూ.600, యూకే జీకి రూ.650 ధరలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క సెట్కు రూ.900, ఆరు నుంచి పదో తరగతి వరకు నోట్బుక్స్ ధరలు రూ.1000 వరకు అవుతున్నాయి. బడా వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టానుసారంగా ధరల ను పెంచేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పేపర్ ధరలు కూడా పెరిగిపోయాయని నోట్ బుక్స్ తయారీదారులు చెబుతున్నారు. విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా. ఇప్పటివరకు పూర్తిగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఇంకా సర్కారు పాఠశాలలకు చేరలేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి నెల ముందే ప్రభుత్వ పాఠశాలలకి సరఫరా చేసేవారు.
ధరలు ఇలా..
క్రౌన్ సైజు వైట్ నోటు బుక్ ధర 132 పేజీల గతంలో రూ.19 ఉండగా, ప్రస్తుతం రూ.35కి పెరిగింది. 160 పేజీల ధర రూ.25 ఉండగా, ఇప్పుడు రూ.45 గా ఉంది. అలాగే 200 పేజీల లాంగ్ నోట్బుక్ ధర రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.55, గతంలో 240 పేజీల బుక్ ధర రూ.45, ప్రస్తుతం రూ.55, 320 పేజీ రూ.55 ఉండగా, ప్రస్తుతం రూ.70, 400 పేజీల బుక్ రూ.65 నుంచి రూ.80కి పెరిగింది. అలాగే రఫ్ నోట్ బుక్స్ ధరలు కూడా బుక్కు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగింది. చిన్న సైజ్ (అప్నా రకం) నోట్స్ గత మూడేళ్ల నుంచి విద్యార్థులు వాడకపోగా ప్రస్తుతం రూ.5 పెరిగింది. అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజీ రికార్డులు, జిరాక్స్ పేపర్ బండిల్, పరీక్ష పేపర్ల బండిల్ ధరలు రూ.50 వరకూ పెరిగాయి.