Homeహైదరాబాద్latest Newsఆంధ్రలో అమ్మాయిల అక్రమ రవాణా..పవన్ చెప్పిందే నిజమైంది

ఆంధ్రలో అమ్మాయిల అక్రమ రవాణా..పవన్ చెప్పిందే నిజమైంది

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. ఓ గ్యాంగ్ నుంచి తప్పించుకొని బాధితుడు చెప్పిన వివరాలతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.

విశాఖ నగరంలోని గాజువాక ఏరియాకు చెందిన చుక్క రాజేశ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేసి ఈ అనుభవంతో కన్సల్టెంట్‌గా మారాడు. తన వద్దకు వచ్చిన వారిని , ఫైర్ సేఫ్టీ చదివినవారిని విదేశాలకు పంపేవాడు. ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తి రాజేశ్‌ను కలిసి కాంబోడియాలో ఉద్యోగాలున్నట్లు తెలిపి ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.90 వేలు వసూలు చేస్తామని ఇందులో రూ.20 వేలు కమీషన్ ఇస్తామని రాజేశ్‌కు చెప్పాడు. కాంబోడియా వెళ్లినవారితో సైబర్ నేరాలు చేయిస్తామని, ఈ విషయం రహస్యంగా ఉంచాలని సూచించారు. అలా వీరిద్దరూ 27 మందిని కాంబోడియాకు పంపారు.

ఈ నేపథ్యంలో రాజేశ్‌కు ఆర్య, హబీబ్ అనే మరో ఇద్దరు ఏజెంట్లు పరిచయమై మరింత ఎక్కువ కమీషన్ ఆఫర్ చేశారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేసి దాదాపు 150 మందిని కాంబోడియాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన వారిని ఆ దేశానికి కొందరు ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు 2500 నుంచి 4 వేల అమెరికన్ డాలర్లకు అమ్మేసేవారు. అనంతరం ఆ కంపెనీల నుంచి వారిని చైనాకు చెందిన కొందరు నిర్బంధించి వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారు. అలా వచ్చిన మొత్తంలో 1 శాతం వీరికి ఇచ్చి.. కంపెనీలు 99 శాతం దోచుకునేవని సీపీ వెల్లడించారు.

అక్కడితో ఆగకుండా వీరిని వ్యసనాలకు బానిసలుగా మార్చేవారని కమీషనర్ పేర్కొన్నారు. అయితే ఈ ముఠా బారి నుంచి తప్పించుకున్న ఓ విశాఖ వాసి అందించిన సమాచారంతో రాజేశ్ సహా మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు రవిశంకర్ తెలిపారు. ఈ గ్యాంగ్ గడిచిన రెండేళ్లలుగా విశాఖ, తుని, రాజమండ్రి, శ్రీకాకుళం, కోల్‌కతాలకు చెందిన దాదాపు 5 వేల మందిని కాంబోడియాకు పంపారని.. రెండేళ్ల కాలంలో రూ.100 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖకు, కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామని కమీషనర్ స్పష్టం చేశారు.

ఈ కేసు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వారాహి విజయయాత్ర సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరుగుతోందని , పెద్ద ఎత్తున ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని చెప్పారు.

Recent

- Advertisment -spot_img