USA revealed china conspiracy on india : భారత్ పై చైనా కుట్రలను బయటపెట్టిన అమెరికా
టిబెట్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతం, అరుణాచల్‌ప్రదేశ్ మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతంలో చైనా 100 ఇండ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది.
ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వానికి ఆందోళన కలగజేస్తున్నాయని పేర్కొన్నది.
‘భారత్ రెచ్చగొట్టే చర్యల వల్లే తాము ప్రతిస్పందించాల్సి వస్తున్నది’ అంటూ భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి చైనా ప్రయత్నిస్తున్నదని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
చైనా జీవాయుధ పరిశోధనలు
రసాయన, జీవాయుధాల తయారీకి సంబంధించిన పరిశోధనలను చైనా ముమ్మరంగా సాగిస్తున్నదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
రెండు రకాలుగా ఉపయోగపడే రకరకాల టాక్సిన్స్‌ను గుర్తించడం, పరీక్షించడం, వర్గీకరించడంపై చైనా మిలిటరీ వైద్య సంస్థల్లో నిర్వహించిన అధ్యయనాల్లో చర్చించారని పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది.
అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని ఆరోపించింది.
అణు కార్యకలాపాలకు అవసరమైన వేదికలను చైనా విస్తరిస్తున్నదని పేర్కొంది.
3 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను ప్రయోగించిన డ్రాగన్
చైనా శనివారం కొత్తగా మూడు భూ పరిశీలనా(రిమోట్ సెన్సింగ్) ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది.
సిచువాన్ ప్రావిన్స్‌లోని షిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
లాంగ్ మార్చ్-2డీ క్యారియర్ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. లాంగ్‌మార్చ్ రాకెట్ల ద్వారా చైనాకు ఇది 396వ ప్రయోగం.
చైనా తన లాంగ్ మార్చ్ రాకెట్ల ద్వారా మొదటి 100 ప్రయోగాలను 37 ఏండ్లలో నిర్వహించగా, రెండో వంద ప్రయోగాలను 7.5 ఏండ్లలో, మూడో వంద ప్రయోగాలను కేవలం నాలుగేండ్లలోనే నిర్వహించింది.
అంటే ఏడాదికి సగటున 25 ప్రయోగాలు నిర్వహిస్తున్నది.