What is suitable word for september 17th issue of nizam Freedom or merge : ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు.
విమోచన దినమని, విద్రోహ దినమని, విలీన దినమని. ఎవరి దృక్పథం ప్రకారం వాళ్ళు అంటున్నారు.
1948 నుంచి ఈ చర్చ కొనసాగుతునే ఉంది. (దేనికి సర్వ జనామోదం లభించలేదు)
ఇటీవల బీజేపీ, దాని అనుబంధ సంఘాల వారు తెలంగాణలో బలపడటానికి ఆ సంఘటనకు మతం కోణాన్ని అద్దే ప్రయత్నం చేస్తున్నారు.
1860లో జరిగిన రాంజీ గోండు తిరుగుబాటును, 1940లో జరిగిన రజాకార్ల దౌర్జన్యాలకి ముడిపెట్టడం ఆ ప్రయత్నాల్లో భాగమే.
అందువల్ల దానికి సంబంధించిన చర్చకు మరింత ప్రాధ్యాన్యత ఏర్పడింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిపోతూ బ్రిటీష్ ప్రభుత్వం ఒక చిచ్చుపెట్టిపోయింది.
దేశంలో అప్పటికి నామమాత్ర స్వతంత్ర్య రాజ్యాలుగా ఉన్న సంస్థానాలకు ఆప్షన్లు ఇవ్వడమే ఆ చిచ్చు.
ఆ సంస్థానాలు భారతదేశంలో కలవొచ్చు, పాకిస్తాన్‌లో కలవొచ్చు. స్వతంత్ర్య రాజ్యాలుగా ఉండవచ్చు అనేది ఆ ఆప్షన్లు.
కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల వందలాది సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి.
రెండు రాజ్యాలు మాత్రం (మరికొన్ని ఉన్నాయనేది సంగిశెట్టిలాంటి వారి వాదన).
స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని అన్నవి నిజాం రాష్ట్రం, కశ్మీర్. ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ రాజ్యానికి హిందు వ్యక్తి హరి సింగ్ రాజు.
హిందువులు (తెలుగువారు) మెజారిటీగా ఉన్న నిజాం రాష్ట్రానికి ముస్లిమైన ఉస్మానలీ ఖాన్ రాజు.
కశ్మీర్ విషయంలో జరగని ఈ (కోణ) చర్చ నిజాం రాష్ట్రం విషయంలో ఎందుకు జరుగుతున్నదనేది గమనార్హం.
స్వాతంత్ర్య ప్రకటనకు చాలా కాలం ముందు నుంచే అంటే 1944 నుంచి ముఖ్యంగా 1946 నుంచే ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక, కమ్యూనిస్టు పోరాటం (దీనిని నిజాం వ్యతిరేక పోరాటంగా కొందరు వక్రీకరించారు) జరుగుతున్నది.
నిజాం రాష్ట్ర విలీనం కోసం వచ్చిన కేంద్ర సైన్యం నిజాం లొంగి పొగానే వెనక్కి వెళ్లకుండా 1951 దాకా ఎందుకున్నది? కమ్యూనిస్టులను అణచడానికేనని, అసలు ఆ హిడెన్ ఎజెండాతోనే సైన్యం వచ్చిందని కాబట్టి అది విద్రోహ దినమని కమ్యూనిస్టులు అన్నారు.
అప్పటికి బీజేపీగానీ దాని పూర్వరూపమైన జనసంఘ్‌గానీ ఉనికిలో లేదు. దాని మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ అప్పటికే ఏర్పడినా అది మహారాష్ట్ర, ఉత్తర భారతంలోనే ఉంది గానీ తెలంగాణాలో లేదు.
హిందూ మహాసభ, ఆర్య సమాజం వంటి సంస్థలలో ఆ భావజాలం కలిగిన వాళ్లు బీజ రూపంలో ఉన్నప్పటికీ ఇప్పటిలాగా సంఘటితంగా లేరు.
మరి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలోగానీ, రజాకార్ వ్యతిరేక పోరాటంలోగానీ లేని పార్టీ సెప్టెంబర్ 17 గురించి ఎందుకు మాట్లాడుతున్నది?
రజాకార్ల సంస్థ అధ్యక్షుడు నవాబ్ బహదూర్ యార్ జంగ్ ‘నేను పాలకుణ్ని’ (అనల్ మాలిక్) అని ప్రతిపాదించింది నిజమే.
హైదరాబాద్ రాష్ట్రాన్ని ముస్లింల స్వతంత్ర రాజ్యంగా నిలపాలని రజాకార్లు భావించింది నిజమే.
వాళ్ల దౌర్జన్యాలు నిజమే. ఉస్మానలీ ఖాన్ ముస్లిం కావడమూ నిజమే. ఏదో మేరకు ఆయనకు రజాకార్ల భావాలుండడమూ నిజమే.
కానీ, ఆయననుగానీ రజాకార్లనుగానీ ముస్లింలందరికి ప్రతినిధులుగా భావించడం సమంజసమేనా? అట్లా భావించే బీజేపీ వాళ్లు ఆ రోజును ముస్లింల నుంచి విమోచనగా విమోచన దినం అంటున్నారు. మతం రంగును పులుముతున్నారు.
ఇది సమంజసమేనా?
రజాకార్లలో ఎంతోమంది హిందువులున్నారు. అబిద్ హుస్సేన్, సప్రానిలాంటి ముస్లింలు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి జాతీయోద్యమంలో భాగమయినారు.
షోయబుల్లాఖాన్ రజాకార్ల దుశ్చర్యలను ఖండించి హత్యకు గురైనాడు.
బాకర్ అలీ మీర్జా, ముల్లా అబ్లుల్ బాసిత్, ఫరీద్ మీర్జా, నవాబ్ మంజూర్ జంగ్, నవాబ్ అహ్మద్ మీర్జా, మహ్మద్ హుస్సేన్ జాఫ్రీ, అబ్దుల్ మునీమ్‌లాంటి వాళ్లు రజాకార్ల దౌర్జన్యాలను ఖండించినారు.
మరికొందరు ఉస్మానలీఖాన్‌ను లొంగిపోవాలని కోరారు.
కాబట్టి నిజాం, హరిసింగ్‌లాగే ఒక రాజు. ఆయన నుంచి విముక్తి ముస్లింల నుంచి విముక్తి కాదు.
ఫ్యూడల్ వ్యవస్థ నుంచి రాచరిక వ్యవస్థ నుంచి విముక్తిగా భావించడమే సమంజసం.
కమ్యూనిస్టులు జరిపిన సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమై సోషలిస్టు రాజ్యం ఏర్పడాలని కాంక్షించారు. (అప్పటికి నూతన ప్రజాస్వామిక విప్లవమనే భావన లేదు.)
దాన్ని కేంద్ర సైన్యం అడ్డుకుంది కాబట్టి ఆ రోజును విద్రోహ దినం అన్నారు. అప్పటికి సోషలిస్ట్ వ్యవస్థ సాధ్యమయ్యే పనికాదు.
అందువల్ల ఆ రోజును విమోచన దినమని, విద్రోహ దినమని భావించడం సమంజసం అనిపించడం లేదు.
భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థలోకి రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి (నిజానికి ఈ రెండు ప్రక్రియలు ఎంతో కొంత అప్పటికే మొదలైనవి)పరివర్తన ప్రక్రియ మొదలైన దినంగా భావించడం లేదా విలీన దినంగా భావించడం సమంజసం.