– మిస్టరీగా మారిన ఘటన
– కేంద్రమంత్రి కుమారుడే నిందితుడా?
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి నివాసంలో మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ నివాసంలో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. కేంద్రమంత్రి తనయుడే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ తుపాకీ నా కుమారుడు వికాస్ కిశోర్‌దే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పుడు నా కుమారుడు ఇంట్లో లేడు. అతడి స్నేహితులు మాత్రమే ఉన్నారు.’ అని తెలిపారు.