Homeతెలంగాణనగరం.. నరకం..

నగరం.. నరకం..

– గ్రేటర్ హైదరాబాద్​లో దంచికొట్టిన వర్షం
– లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, అపార్ట్ మెంట్ల సెల్లార్​లోకి నీరు
– ఇంట్లోని సామగ్రి తడిసిపోయిందని జనం ఆవేదన
– ఐటీ కారిడార్​లో రోడ్లపై వాటర్​ లాగింగ్స్.. భారీగా ట్రాఫిక్ జామ్
– వానల కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు

ఇదే నిజం, నెట్​వర్క్: గ్రేటర్ హైదరాబాద్​ను వాన వీడటం లేదు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు నాన్​స్టాప్​గా వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ నీటితో నిండిపోగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోని సామగ్రి తడిసిపోయిందని జనం వాపోయారు. గ్రేటర్​తో పాటు శివారు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వానకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్​ జామ్​ సమస్య ఏర్పడింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్ పల్లి, అల్వాల్, బాలాజీ నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కూకట్ పల్లి, అమీర్ పేట, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, ఘట్​కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నప్పటికీ వాహనదారులకు ట్రాఫిక్​ జామ్ సమస్య తప్పడం లేదు. ఎమర్జెన్సీ అయితే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌ నం. 040-21111111కు లేదా 100కు, 9000113667కు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప జనం బయటికి రావొద్దని బల్దియా అధికారులు సూచిస్తున్నారు. వానల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని స్కూళ్లకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ పేర్కొంది.

గ్రేటర్ సిటీ ఆగమాగం..
అలాంటి ఇలాంటి వాన కాదు. కుండలతో పోసినట్టు కురుస్తోంది. అక్కడా ఇక్కడా కాదు హైదరాబాద్‌ మొత్తంగా కురుస్తోంది. జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. అర్థరాత్రి నుంచి పడుతున్న వాన జనజీవనాన్ని స్తంభింప జేసింది.
ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆటోలు, క్యాబ్‌లు బుక్‌ కావడం లేదు. బుక్ అయినా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో కూడా భారీగా వసూలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా వసూలు చేసే ఛార్జీల నాలుగైదు రెట్లు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులు వ్యయప్రయాసలు కోర్చి ఆఫీసులకు చేరుకుంటున్నారు. మిగతా వారి పరిస్థితి వర్ణించడానికి మాటలు చాలవు అన్నట్టు ఉంది. సొంత వాహనాలు ఉన్న వారిది మరో కష్టం. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటిలో ప్రయాణం ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నారు. కొందరు తడుస్తూనే ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఎక్కడ ఏ రోడ్డు తెగి ఉంటుందో, ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో అన్న భయంతోనే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. పరిస్థితి గమనించిన వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఈ రోజంతా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతోంది. భారీగా పడుతున్న వర్షంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. జీడిమెట్ల, మారేడుపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు, హస్తినాపురం, నిజాంపేట, అల్విన్ కాలనీ, చిలకలగూడ, సికింద్రాబాద్, సోమాజీగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, ప్రగతీనగర్, కూకట్‌పల్లి, అడ్డగుట్ట, కంటోన్మెంట్‌, బోయినపల్లి, కర్ఖానా, మెహదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కొండాపూర్, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, కోఠఈ, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్‌ ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది.

మైసమ్మగూడలో హాస్టల్​ మొదటి అంతస్తులోకి వర్షపు నీరు
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉంటున్న వసతి గృహాల మొదటి అంతస్తులోకి వరదనీరు చేరింది. సుమారు 15 అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తరలిపిస్తోంది. ఆందోళన చెందుతున్న విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు. నీటి కాలువలు, కుంటలు కబ్జా చేసి భవనాలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

మళ్లీ ట్రా‘ఫికర్’

వర్షాలు పడిన ప్రతిసారి గ్రేటర్​లోని వాహనదారులకు ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు. పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనదారులు అవస్థలు పడ్డారు. అమీర్‌పేటలోని మైత్రీవనం, మూసాపేట మెట్రోస్టేషన్‌ వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్‌హోళ్లలో చెత్త పేరుకుపోవడంతో వరదనీరు దిగువకు వెళ్లడం లేదు. వరదనీరు కారణంగా పలు చోట్ల ఒకే మార్గంలో రాకపోకలను అనుమతించారు.

మేయర్ సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. జోనల్‌ కమిషనర్లతో ఆమె సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్‌ ఆదేశించారు. అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని నగరవాసులను కోరారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలశయాల గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో మూసీ నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్‌లను మేయర్‌ ఆదేశించారు.

ఐటీ ఎంప్లాయీస్.. వర్క్ ఫ్రమ్ హోం బెటర్
తెలంగాణ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకూ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కి కాల్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్‌శాఖ సోషల్‌ మీడియాలో పలు సూచనలు చేసింది.
మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పలు చోట్ల 10 సెం.మీ దాటి వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో ఆయన మాట్లాడారు. ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. రోడ్లపై చెట్లు, కొమ్మలు పడితే వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నీటిమట్టాలను పర్యవేక్షించాలని సూచించారు. నాలాల నుంచి ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ వాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
అత్యవసర సాయం కోసం హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040- 2111 1111, డయల్‌ 100, ఈవీడీఎం కంట్రోల్‌ రూం నంబర్‌ 9000113667లకు సంప్రదించాలన్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
ఏరియా వర్షపాతం (సెం.మీ)
శేరిలింగంపల్లి 14
మియాపూర్‌ 14
కూకట్ పల్లి 12.7
హైదర్‌నగర్ 12.7
రాజేంద్రనగర్ 12
షేక్‌పేట 11.9
బోరబండ 11.6
మాదాపూర్‌ 10.7
రాయదుర్గం 10.1
ఖైరతాబాద్‌ 10.1
గాజులరామారం 10
రాజేంద్రనగర్‌ 10
గచ్చిబౌలి 9.6
బహదూర్‌పురా 8.2
చిలకలగూడ 8.1

జాగ్రత్తలు పాటించాలి: టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ
రాష్ట్రంలో భారీ వానల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్‌ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడే సమయంలో జనం స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు. వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద నిలబడకుండా వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లు, నీటిలో విద్యుత్ తీగ పడి ఉంటే దాన్ని తొక్కడం.. వాటి మీద నుంచి వాహనాలు నడపడం వంటివి చేయొద్దన్నారు. కరెంట్ కు సంబంధించి ఎమర్జెన్సీ ఉంటే 1912, 100 నంబర్లకు కాల్​ చేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 7382072104, 7382072106, 7382071574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img