– లీడర్లు పార్టీ వీడుతున్నా బీఆర్ఎస్ డోన్ట్ కేర్
– అన్ని లెక్కలు వేసుకొనే కేసీఆర్ టికెట్లు
– తుమ్మల పోయినా పట్టించుకోని హైకమాండ్
– రేఖానాయక్, వేముల వీరేశం విషయంలోనూ అంతే..
– ఎప్పటికప్పుడు గులాబీ బాస్ ఫ్లాష్ సర్వేలు
– నియోజకవర్గాల పరిస్థితులపై అంచనా
ఇదేనిజం, హైదరాబాద్: ఒకేసారి 115 సెగ్మెంట్లకు టికెట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ లీడర్లు పార్టీని వీడినా పెద్దగా పట్టించుకోవడం లేదు. తొలుత కొందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా మాట వినని నేతల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ డోన్ట్ కేర్ అంటున్నారు. టికెట్ తమకే వస్తుందని ఆశించి భంగపడ్డ నేతల్లో ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి ఉంది. ఖానాపూర్ లో రేఖానాయక్ ను పక్కకు పెట్టి.. అక్కడ కేటీఆర్ మిత్రుడు జాన్సన్ రాథోడ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు. దీంతో రేఖానాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని వీడబోతున్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్ఎస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. ఆమె వెళ్లిపోయినా పెద్దగా నష్టం లేదని.. పార్టీ భావించినట్టు సమాచారం.
తుమ్మల వెళ్తున్నా..
మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేత తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బలం చూపించేందుకు భారీగా ర్యాలీ నిర్వహించారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. తొలుత నామానాగేశ్వరరావు వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తుమ్మల వినకపోవడంతో హైకమాండ్ పట్టించుకోలేదు. ఆయన రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పాలేరులో కాంగ్రెస్ టికెట్ ను పొంగులేటి, షర్మిల ఆశిస్తున్నారు. వీరితో పాటు పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సీపీఎం అంటోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాలేరు టికెట్ తుమ్మలకు దక్కుతుందా? అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే అనేక గ్రూపులున్న ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో తుమ్మల పరిస్థితి ఏమిటో వేచి చూడాలి.
వేముల వీరేశాన్ని పట్టించుకోని అధిష్ఠానం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కానీ టికెట్ విషయంలో హస్తం పార్టీ నుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదని సమాచారం. అయితే వేముల వీరేశం వెళ్లిపోయినా తమకు పెద్దగా నష్టం లేదని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇలా పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నా.. వారిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. నిజంగా ఆయా నియోజకవర్గాల్లో నేతలకు పట్టు ఉంటే వారిని ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ పదవులు ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. అయితే పెద్దగా బలంలేని లీడర్లను వారు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కు నష్టం లేదని భావిస్తే మాత్రం పట్టించుకోవడం లేదు.