నా మైక్‌కట్ చేస్తారా?
మణిపూర్ ఘటనపై మోడీ స్పందించాలి
– ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
పార్లమెంటులో కొనసాగుతున్న లొల్లి
- ఇదేనిజం, నేషనల్ బ్యూరో:
మణిపూర్ ఘటనపై గత కొన్ని రోజులుగా ఉభయసభలు దద్దరిల్లిపోతున్నాయి. మణిపూర్ హింసపై మోడీ మాట్లాడిల్సిందేని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. రాజ్యసభలో తన మైక్ కట్ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ కట్ చేయడం అంటే తన ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమేనని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ మైక్ కట్ చేయడం తనను అవమానించడమేనన్నారు బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభమైన తర్వాత మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. పలు అంశాలను సభ దృష్టికి తీసుకువస్తున్నాని చెప్పారు.‘267 కింద 50మంది నోటీసులు ఇచ్చినప్పటికీ పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. కనీసం నేను మాట్లాడేటప్పుడైనా.. అది పూర్తికాకుండానే నా మైక్‌ను ఆఫ్ చేశారు. ఇది నా హక్కులకు భంగం కలిగించడమే. ఇది నాకు అవమానకరమే. వాళ్లు నా ఆత్మగౌరవాన్ని సవాలు చేశారు. ఒకవేళ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సభ నడుస్తుందనుకుంటే.. అది ప్రజాస్వామ్యం కాదనే నేను భావిస్తా’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంగళవారం సభలో చోటుచేసుకున్న వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అధికార పక్షం తీరుపై మల్లికార్జున ఖర్గే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.