Homeజాతీయం18 నుంచి స్పెషల్ సెషన్స్

18 నుంచి స్పెషల్ సెషన్స్

– కొత్త బిల్డింగ్ సెంట్రల్ విస్టాలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు
– జమిలీ ఎన్నికలపైనే చర్చ?
– హుటాహుటిన సమావేశాలు ఎందుకు: ప్రతిపక్షాలు
– జమిలీపై కంగారు వద్దు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త బిల్డింగ్ సెంట్రల్ విస్టాలో తొలిసారిగా ఈ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు అమ్ములపొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం ఏంటన్నది కేంద్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహణ(జమిలీ ఎన్నికలు)పైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలు ఉండగా ప్రతిపక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసి హుటాహుటిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దీనికి సిద్ధపాటుగా ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
జమిలీ ఎన్నికల నిర్వహణపై వేసిన కమిటీ గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఇప్పుడే కమిటీ వేశామని, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ‘కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది. తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. తర్వాత కమిటీ నివేదిక పార్లమెంట్‌లోకి వస్తుంది. సభలో నివేదికపై చర్చ జరుగుతుంది. పార్లమెంట్‌లో విజ్ఞులు, మేధావులు ఉన్నారు. భారత్ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చేటప్పుడు దానిపై చర్చించడం అవసరం. ఇదేమీ తెల్లారగానే అమలు చేసే అంశం కాదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏం చర్చిస్తామనే దానిపై రెండు, మూడు రోజుల్లో చెబుతాం. 1967 వరకు భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. దీనిపై చర్చ జరగాల్సిందే’’ అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.
వన్ నేషన్– వన్ ఎలక్షన్ బిల్లుపై ఊహాగానాలు
ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం-– ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెడతారని సభ్యులు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణను పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్చేందుకే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అనూహ్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక బిల్లుని ఆమోదించే అవకాశం లేకపోలేదని కొంతమంది చెబుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img